Yashasvi Jaiswal Double Century: భారత యువ బ్యాటర్, భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. అసలు బజ్‌బాల్ ఆటంటే ఏంటో ఇంగ్లాండ్ జట్టుకు తెలుసొచ్చేలా చేశాడు. వన్డే తరహా ఆటతీరుతో బ్రిటీష్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన జైస్వాల్… వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ద్వి శతకంతో మెరిసి అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
రికార్డుల మోత
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. జైస్వాల్ తర్వాత 855 పరుగులతో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా ఉన్నాడు. టీమిండియా తరపున టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ పేరిట ఉన్న 535 పరుగుల రికార్డును 545 పరుగులతో యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు నమోదు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 12 సిక్స్‌లు కొట్టాడు. వసీమ్ అక్రమ్ కూడా ఒక ఇన్నింగ్స్‌లో 12 సిక్సులు కొట్టాడు. వీరిద్దరూ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టెస్టుల్లో.. ఒకే ఓవర్‌లో మూడు సిక్స్‌లు కొట్టిన ఐదో భారత బ్యాటర్ యశస్వి. అతడి కంటే ముందు ధోనీ, హార్దిక్, రోహిత్, ఉమేశ్ ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్‌గానూ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. వరుసగా రెండు ద్విశతకాల బాదిన మూడో టీమ్‌ఇండియా క్రికెటర్‌గానూ నిలిచాడు. వినోద్ కాంబ్లి, విరాట్ కోహ్లీ అతడి కంటే ముందు రెండు మ్యాచ్‌ల్లోనూ డబుల్ సెంచరీలు చేశారు.
రెండో టెస్ట్‌లో యశస్వీ రికార్డులివి
వైజాగ్ టెస్ట్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్న 16వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సిక్సర్‌తో సెంచరీ మార్కును తొలుత పాలీ ఉమ్రిగర్ అందుకోగా.. అత్యధిక సార్లు ఈ ఘనతను సాధించిన బ్యాటర్‌గా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఏకంగా ఆరు సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు. సచిన్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు సార్లు ఇలా సెంచరీ మార్కును తాకాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తలో రెండు సార్లు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశారు.
హర్భజన్ సింగ్, అశ్విన్ కూడా సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశారు. వీరిద్దరూ తలో సారి ఇలా సెంచరీ మార్కును అందుకున్నారు. కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్, రాహల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఎంఎస్ ధోని, పుజారా ఉన్నారు. సిక్సర్‌తో సెంచరీ మార్కును ఓసారి తాకిన సెహ్వాగ్.. డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ మార్కును కూడా సిక్సర్‌తో చేరుకుని చరిత్రపుటల్లోకెక్కాడు. 22 ఏళ్ల లెయశస్వి జైస్వాల్ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. 23 ఏళ్ల వయసు కంటే ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లి ఈ ఘనత సాధించారు.