ప్రస్తుతం ఓటీటీ హవా బాగుంది. ఓ పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వెబ్ సీరిస్‌లలో ఎక్కువగా క్రైమ్ కథలతో రూపొందిన వాటినే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. నిజ జీవితంలో క్రైమ్ కథలు కోకొల్లలుగా దొరుకుతాయి. వాటికి తెరరూపం ఇవ్వడం ద్వారా కొందరు నిర్మాతలు లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి ఓ రియల్ స్టోరీతో రూపొందిన వెబ్‌సిరీస్‌ని ఆపాలంటూ సీబీఐ కోర్టుకెక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును వెబ్ సిరీస్ రూపంలో తీసుకు వస్తున్నారు. ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ’ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఆ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఆపెయ్యాలంటూ సీబీఐ కోర్టుకెక్కింది. ఈ నెల 20న ఈ కేసుకు సంబంధించిన హియరింగ్ ఉంది. ఈ కేసు తుది తీర్పు వెలువడే వరకు ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ నిలిపివేయాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
2012లో ముంబయిలో మెట్రో వన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షీనా బోరా కనిపించకుండా పోయింది. 2015లో షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, సవతి తండ్రి పీటర్ ముఖర్జీ, తల్లి కారు డ్రైవర్ అరెస్టు చేశారు. అప్పటి నుండి ఈ కేసు నడుస్తూనే ఉంది. ఈ కేసులో ఇంద్రాణీతో సహా ముగ్గుర్ని అరెస్టు చేయగా.. జైలులో ఉన్నారు. ఆరున్నరేళ్ల తర్వాత.. 2022 మే నెలలో జైలు నుండి విడుదలయ్యింది ఇంద్రాణీ. ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉంది కాబట్టి ఈ సిరీస్‌ను నిలిపి వేయాలని కోర్టును కోరింది సీబీఐ.