Medak Road Accident News: మెదక్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో పాపన్నపేటకు చెందిన వ్యక్తులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. డాకుర్ గ్రామంలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై బాచారం తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు.
ఫ్లైఓవర్ పై వేగంగా ఢీకొన్న కారు, బైక్
జాతీయ రహదారి 161 హైవేపై ఫిబ్రవరి 19న రాత్రి 8 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లాదుర్గం మండలం, గడిపెద్దాపూర్ మధ్య పెద్దాపూర్ ఫ్లైఓవర్ పై కారు, బైక్ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. పెద్ద శంకరంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు పెద్దాపూర్ ఫ్లైఓవర్ పై రాంగ్ రూట్లో వస్తున్న బైకును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో బైకుపై నలుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రక్తసిక్తమైన రోడ్డు.. భయానక వాతావరణం
కారు, బైక్ ఢీకొన్న చోట భయానక వాతావరణం కనిపించింది. ప్రమాదంలో ఒకరి కాలు తెగిపడిపోయింది, మరొకరి చేయి తెగిపోయింది. ఒకరి నడుము విరిగిపోవడంతో ప్రమాదం జరిగిన ఆ ఫ్లైఓవర్ రక్తసిక్తం అయింది. మృతులను పాపన్నపేట్ మండలం బాచారానికి చెందిన గడ్డం ప్రభాకర్ (29), భీమయ్య (28), అల్లదుర్గం శ్రీకాంత్ (25) అని పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయిన ప్రభాకర్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, ఎస్సై ప్రవీణ్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని చూడండి