Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోటీ లేకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో పెద్దల సభలోకి సోనియా అడుగుపెట్టనున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సోనియాగాంధీకి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘తల్లిగా అమరుల త్యాగాలకు తల్లడిల్లి… నాయకురాలిగా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి… తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీమతి సోనియాగాంధీ గారు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ రేవంత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సోనియాగాంధీకి తాను పుష్పగుచ్చం అందిస్తున్న ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు. రేవంత్ ట్వీట్ వైరల్‌గా మారగా.. సోనియాకు కాంగ్రెస్ కార్యకర్తలు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్ స్థానం నుంచి ఆమె గెలుస్తూ వస్తున్నారు. వయస్సు రీత్యా, అనారోగ్యం కారణంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని సోనియా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె స్థానమైన రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోనియా స్థానం నుంచి ఆమె కూతురు, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేస్తున్న ప్రియాంక.. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగలేదు. కానీ రానున్న ఎన్నికల్లో పోటీలోకి దిగాలని చూస్తున్నారు. దీంతో రాయ్‌బరేలీ అయితే సేఫ్ అని ప్రియాంక భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. దీంతో అక్కడ నుంచి పోటీ చేస్తే ప్రియాంక గెలుపు ఖాయమని హస్తం పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.
కాగా రాయ్‌బరేలీ ప్రజలకు ఇటీవల సోనియా ఒక లేఖ రాశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఇక నుంచి తానకు నేరుగా సేవ చేసే అవకాశం ఉండదంటూ ఎమోషనల్ అయ్యారు. భవిష్యత్తులోనూ తన కుటుంబానికి అండగా ఉంటారని ఆశిస్తున్నానని, రాయ్‌బరేలీ ప్రజలందరూ ఎప్పుడూ తన హృదయంలోనే ఉంటారని అన్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది రాయ్‌బరేలీ ప్రజల వల్లనేనని, అక్కడి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఎల్లప్పుడూ కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలతో తన కుటుంబానికి ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉందని, తన అత్తమామల నుంచి తనకు అదృష్టంగా ఇది లభించిందని తెలిపారు. తమ కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో ఇక్కడి ప్రజలు తమకు అండగా నిలిచారని, అప్పుడే మన మధ్య బంధం మరింత బలపడందని అన్నారు. త్వరలోనే రాయ్‌బరేలీ ప్రజలను కలుస్తానని సోనియాగాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని చూడండి