ఈమధ్యకాలంలో త్రిష సినిమాల్లో కంటే వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఉంది. ఆమధ్య మన్సూర్ అలీఖాన్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. సినిమా ఇండస్ట్రీ అంతా ఆమెకు అండగా నిలబడిరది. మొత్తానికి మన్సూర్ ఆమెకు క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. ఇప్పుడు మరో కొత్త వివాదం త్రిషను చుట్టు ముట్టింది. దీంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది.
విషయం ఏమిటంటే.. తమిళనాడులోని అన్నా డిఎంకె పార్టీకి చెందిన నాయకుడు ఎ.వి.రాజు ఇటీవల త్రిషపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో క్లిప్ బాగా సర్క్యులేట్ అవుతోంది. ఆ వీడియో క్లిప్‌లో ఎ.వి.రాజు మాట్లాడిదేమిటంటే.. ఒక రాజకీయ నాయకుడు రూ.25 లక్షలు త్రిషకు ఇచ్చి రిసార్ట్ పిలిపించుకున్నాడని అతను వ్యాఖ్యానించాడు. దీంతో తమిళ రాజకీయాల్లో అలజడి మొదలైంది. ఈ వ్యాఖ్యలు చేసిన ఎ.వి.రాజుపై సినీ ప్రముఖులతోపాటు కొందరు రాజకీయ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన అన్నా డిఎంకె నాయకత్వం ఎ.వి.రాజును సస్పెండ్ చేసింది.
ఈ కొత్త వివాదంపై త్రిష స్పందిస్తూ.. ‘వారి స్వార్థం కోసం ఎదుటివారిని కించ పరిచేలా మాట్లాడడం ఎంతవరకు సబబు. కేవలం ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు ఎంతటి నీచానికైనా దిగజారే మనుషుల్ని పదే పదే చూడాల్సి రావడం చాలా అసహ్యం కలిగిస్తోంది. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు వస్తున్న ఇలాంటి ఆరోపణలపై తీవ్రంగా స్పందించాలని నిర్ణయించుకున్నాను. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. నాకు సంబంధించిన లీగల్ టీమ్ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అన్నారు.