Eatala Rajender challenges Revanth Reddy: 5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకావని.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. పదేళ్ళ పాలనకే కేసీఆర్ కి ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిందని అన్నారు. కానీ మళ్ళీ మోదీనే ప్రధాని కావాలని దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారని అన్నారు. ఈటల రాజేందర్ గురువారం ఆసిఫాబాద్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొని మాట్లాడారు.
‘‘విజయ సంకల్ప యాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుయ్యేలా ఒత్తిడి తీసుకురండి అని, కాంగ్రెస్ వారు నాలుగు వందల హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైనవి 66 ఉన్నాయి. పాలసీలు ప్రకటించుకుంటూ పోయారు. ఎవరు సలహాలు ఇచ్చారో కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంలో వీటిని ఎలా అమలు చేస్తారు అని నవ్వుకున్నా. అధికారంలోకి వస్తామా రామా అని ఇచ్చినట్టు ఉంది.
అమలు సాధ్యం కాదని తెలిసినా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి.. ఓట్లు పడవు అనే భయంతో అప్లికేషన్లు తీసుకొని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నా. సీఎం గారు.. ఊరిస్తున్న మంత్రులారా.. మహిళలకు రూ.2500, కళ్యాణలక్ష్మి తులం బంగారం, మహిళాసంఘాలకు వడ్డీలేని రుణాలు ఎప్పటినుండి ఇస్తారు?’’ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటా
కేసీఆర్ అడ్డగోలు హామీలు ఇచ్చినప్పుడే నీ అయ్యజాగీరు కాదు.. ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి అని చెప్పిన. ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు. మరి ఈ సిపాయి రెండు లక్షల రుణమాఫీ ఎలా చేయగలడు. ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. రూ.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకావు. ఇప్పుడే నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించను కానీ విజ్ఞత గల ప్రజలారా ఆలోచన చేయండి.
ఈ జిల్లాల్లో కేసీఆర్ 8 ప్రాజెక్ట్ లు నిర్మించినా తూములు కట్టలేదు.. కాలువలు తవ్వలేదు నీళ్లు ఇవ్వలేదు. అడవి బిడ్డలు ఆకాశంమీదనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం అయినా వెంటనే ఇవ్వాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నా. పదేళ్ళ పాలనకే కేసీఆర్ కి ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగింది. కానీ మళ్ళీ మోదీనే ప్రధాని కావాలని దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. నరేంద్ర మోదీ నేను మీ పాలకుణ్ని కాదు సేవకుణ్ని అని చెప్తారు.
బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. UAE లాంటి ముస్లిం దేశంలో కూడా హిందూ దేవాలయం నిర్మించి ఇచ్చిన నాయకుడు మోదీ. బీఆర్ఎస్ కి ఓటు వేసినా, కాంగ్రెస్ కి ఓటు వేసినా ఏమీ రాదు. బీజేపీకి ఓటు వేస్తే నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు. ప్రపంచపటం మీద భారత కీర్తి పతాకం ఎగురవేయడానికి మరో సారి అవకాశం ఇవ్వమని మోదీ అడుగుతున్నారు. భారత దేశ సమగ్ర అభివృద్ధి కోసం, పేదరిక నిర్మూలన కోసం, దేశ కీర్తిని పెంపొందించడం కోసం బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నాను’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
మరిన్ని చూడండి