చర్చలు విఫలం-బొప్పరాజు
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ(Ministers Committee) చర్చలు సఫలం కాలేదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సంప్రదాయం ప్రకారం పీఆర్సీని నియమించినప్పుడు మధ్యంతర భృతి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, గత పీఆర్సీ(PRC) అరియర్ లు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపులపై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. పీఆర్సీ అరియర్ లు రూ.14,800 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఎప్పుడు చెల్లించేది చెబుతామని గత సమావేశంలో చెప్పారని, దీనిపై స్పష్టత రాలేదన్నారు. మధ్యంతర భృతి ప్రకటనకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం రివర్సు పీఆర్సీ ఇచ్చిందన్నారు. 12వ పీఆర్సీని జులై 31 లోపే సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. అందుకే మధ్యంతర భృతి ప్రకటించడం లేదని చెప్పారని తెలిపారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్(Pension) పై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దకరణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందని బొప్పరాజు ఆరోపించారు.10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే రెగ్యులర్ చేశారన్నారు.