Medaram Jatara 2024 Concluded on Grand Note: ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర (Medaram Jatara) శనివారం రాత్రి ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు అట్టహాసంగా సాగిన మేడారం మహాజాతర (ఫిబ్రవరి 24న) ముగిసింది. సమ్మక్క-సారలమ్మ జనం వీడి తిరిగి వన ప్రవేశం చేశారు. దీంతో కన్నుల పండుగగా జరిగిన మేడారం మహా జాతర (Sammakka Sarakka Jatara) అధికారికంగా ముగిసింది. అయితే అమ్మలు వనానికి కదిలే వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా సూర్యుడు భగభగ మండుతూ వాతావరణం వేడిగా ఉండేది. కానీ నేడు సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశం చేస్తారనగా.. మేడారం ప్రాంతంలో చిరుజల్లులు కురిశాయి.
బుధవారం ఘనంగా ప్రారంభమైన గిరిజన జాతర మేడారం జారత శనివారం రాత్రి ముగిసింది. పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు సమ్మక్క, సారలమ్మలను గద్దెలపై నుంచి దింపిన ఆదివాసీ పూజారులు ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. లైట్లను ఆర్పివేసి.. వెన్నెల కాంతిలో గద్దెల వద్ద అమ్మవార్లకు తుది పూజలు నిర్వహించారు. నేడు చివరిరోజు కావడంతో జాతర వీక్షించడానికి, మహా ఘట్టం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి తరలివచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం మేడారం తరలివచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సీతక్క ధన్యవాదాలు
‘మేడారం జాతర నిర్వహణకు అత్యధిక నిధులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు, మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. దేవాదాయ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్, ఎస్పి, ఇతర 20 శాఖల అధికారులు జాతర ఏర్పాట్లకు కష్టపడ్డారు. వార్తలను బయట ప్రపంచానికి చెరవేసిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. వరదల మూలంగా మేడారం రోడ్లు భవనాలు మునిగిపోయాయి. తక్కువ టైంలో వాటిని మరమ్మతులు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఏషియా లోనే కాదు ప్రపంచం లోనే అతి పెద్ద జాతర. మధ్యాహ్నం వరకే కోటి 35 నుండి 45 లక్షల భక్తులు వచ్చినట్టు ప్రాథమిక అంచనా. రవాణా శాఖ 6000 బస్సులను నడిపింది . నిన్న సాయింత్రం వరకు 12 వేల ట్రిప్పులు. 10 నుండి 12 కిమీ వైశాల్యం లో ఇంత మంది రావడం ఈ ప్రాంత బిడ్డగా గర్వకారణం’ అన్నారు మంత్రి సీతక్క.
ఎండ తీవ్రత వున్నా రద్దీ తగ్గలేదని.. గంటలో వనప్రవేశం ఉన్న ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోందన్నారు. మేడారం వచ్చిన భక్తులు అందరికీ తల్లుల దర్శనం అయ్యేంతవరకు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. మేడారం జాతరలో 5090 మంది పిల్లలు తప్పి పోయారు, ఇప్పటికే 5062 పిల్లలను వారి కుటుంబానికి అప్పజెప్పినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మిగిలన పిల్లలు సురక్షితంగా ఉన్నారని.. వారి కుటుంబసభ్యులు జంపన్న వాగు దగ్గర వున్నా మిస్సింగ్ పాయింట్ దగ్గరకు రావాలని సూచించారు. మేడారం జాతర నిర్వహణలో లోటుపాట్లు ఉంటే స్వీకరిస్తామని, రానున్న జాతరకు సరి చేసుకుంటాం అన్నారు.
మరిన్ని చూడండి