Lasya Nandita Car Accident: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే కారు డ్రైవర్ ఆకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించిన వివరాలపై మరింత ఆరా తీస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం సమయంలో డ్రైవర్ ఆకాశ్ మద్యం సేవించి ఉన్నాడా? అనే వివరాలను సేకరిస్తున్నారు. ఆకాశ్ రక్త నమునాలను పరీక్షల కోసం పంపారు. ఆ వివరాలు అందితే ఘటన సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అనే విషయం తేలనుంది. అలాగే డ్రైవర్ ఆకాశ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
కారును ఏ వాహనం ఢీకొట్టింది? ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. ఎమ్మెల్యే వెళుతున్న కారు ముందు వెళ్తున్న వెహికల్‌ను ఢీకొట్టడంతో రెండో లైనులో వెళ్తోన్న వెహికల్ రెయిలింగను ఢీకొని ఆగినట్లు గుర్తించారు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 500 మీటర్ల దూరంలో కారుపై రాక్ శాండ్ పడి ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు కారు స్పేర్ పార్టులు కూడా అక్కడ లభించాయి. దీంతో లాస్య నందిత ప్రయాణిస్తున్న కారును ఏ వాహనం ఢీకొట్టి ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్లిన వాహనాల వివరాలను సేకరిస్తున్నారు. టిప్పర్ లేదా రెడిమిక్స్ ఢీకొట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హైప్రొఫైల్ కేసు కావడంతో లోతుగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే డ్రైవర్ ఆకాశ్‌ను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి అతడి వాంగ్మూలం తీసుకున్నారు. అతడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం సమయంలో తనకు ఏం అర్ధం కాలేదని, మైండ్ బ్లాక్ అయిందని పోలీసులకు ఆకాశ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదని చెప్పాడు. సదాశివపేట దర్గా నుంచి హైదరాబాద్ వచ్చామని, లాస్య నందిత ఫుడ్ తినాలంటే హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లామని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ ప్రమాదంలో ఆకాశ్‌కు స్వల్ప గాయాలవ్వగా.. అతడు చికిత్స తీసుకుని కోలుకున్నాడు. అయితే ఆకాశ్ నిర్లక్ష్యంగా కారు నడిపి లాస్య నందిత మరణానికి కారణమయ్యాడంటూ ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకాశ్‌పై సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు ఆమె భౌతికకాయానికి సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు కూడా నివాళులు అర్పించారు. లాస్య నందిత హఠాన్మరణంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లాస్య నందిత తండ్రి సాయన్న ఏడాది క్రితం మరణించగా.. ఇప్పుడు కూతురి మరణంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబాన్ని పలువురు నేతలు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ కవిత నందిత కుటుంబాన్ని పరామర్శించారు.
మరిన్ని చూడండి
Source link