కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం
కాకినాడ(Kakinada) జిల్లా పత్తిపాడు జాతీయ రహదారిపై పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కాకినాడ, చిన్నంపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఏపీఎస్ఆర్టీసీ(APSRTC Bus) బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. లారీకి పంక్చర్ అయిన కారణంగా రోడ్డు పక్కకు ఆపి, నలుగురు వ్యక్తులు టైర్లు మారుస్తున్నారు. ఈ సమయంలో అటుగా వేగంగా వచ్చిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ముగ్గురు లారీ డ్రైవర్లు, ఒకరు క్లీనర్ ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురిది బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెం కాగా, మరొకరిది ప్రత్తిపాడు అని పోలీసులు తెలిపారు. పత్తిపాడు హైవేపై వస్తుండగా లారీ టైర్ పంక్చర్ అయింది. దీంతో టైర్లు మార్చేందుకు హైవే పక్కన లారీని ఆపాడు. టైర్లు మార్చేందుకు పక్క లారీ డ్రైవర్లును పిలిచాడు. వారంతా కలిసి టైర్లు మారుస్తుండగా.. వేగంగా వచ్చిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వారిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగినా ఆర్టీసీ బస్సును ఆపకుండానే డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు వద్ద ఆర్టీసీ బస్సును పట్టుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.