Floating Bridge On Vishakhapatnams RK Beach: విశాఖపట్నంలోని సాగర తీరంలోని కురుసుర సబ్ మెరైన పక్కన అత్యంత ప్రతిష్టాత్మకంగా వీఎంఆర్‌డీఏ ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ (Floating Bridge) తొలిరోజే సందర్శకులకు నిరాశను మిగిల్చింది. కోటి 60 లక్షల వ్యయంతో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్ధేశంతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేశారు. సాగర తీరంలోని అలలపై తేలియాడే బ్రిడ్జ్ నడవడం ద్వారా సరికొత్త అనుభూతిని పొందవచ్చని భావించిన పర్యాటకులకు తొలిరోజే అసంతృప్తి మిగిలింది. సముద్ర తీరం నుంచి వంద మీటర్లు లోపల ఉన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరి ఫ్లాట్ ఫామ్ తెగిపోయిందని ప్రచారం జరిగింది. ముందు నుంచి ఉన్న ఫ్లాట్‌పామ్‌తో దానికి అనుబంధం తెగిపోవడంతో సముద్రం లోపలకు కొట్టుకుపోయింది. ఈ చివరి ఫ్లాట్‌పామ్‌ను తెచ్చి అతికించేందుకు టెక్నికల్ సిబ్బంది, గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉదయం తెగిపోవడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని, ఒకవేళ సందర్శకులు వెళ్లిన సమయంలో తెగిపోయి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని పలువురు పేర్కొంటున్నారు.
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదు!
సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలను అధికారులు, నిర్వాహకులు ఖండించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదని, అలలు తీవ్రత అధికంగా ఉండడం వల్ల తొలగించినట్టు వెల్లడించారు. అలలు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నిర్వహణలో భాగంగా తొలగిస్తామని చెప్పారు. ట్రయల్ రన్‌లోనే ఫ్లోటింగ్ బ్రిడ్జి ఉందని, మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ భద్రతపై ఆందోళన అవసరం లేదని, సందర్శకులు వెళ్లినప్పుడు లైఫ్ జాకెట్ ఇవ్వడంతోపాటు ఇరువైపులా రెండు పడవల రక్షణ సిబ్బంది, గజ ఈతగాళ్లు ఉంటారని వెల్లడించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిందన్న ఉద్ధేశంతో సోమవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చారు. ఇక్కడి పరిస్థితితో వారంతా నిరుత్సాహంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం
ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వాస్తవంగా సోమవారం (ఫిబ్రవరి 26) నుంచి సందర్శకులను అనుమతించాలని భావించామని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తెలిపారు. వాతావరణములో మార్పుల కారణంగా సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండటంతో నేడు సందర్శకులను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి అనుమతించ లేదు. సముద్ర ప్రవాహాల తీవ్రత రీత్యా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు “T” పాయింట్ (వ్యూ పాయింట్) ను బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టత ను పరిశీలించే నిమిత్తము, ఏంకర్ (anchor) లకు దగ్గరగా జరిపి నిలిపి ఉంచామన్నారు. ఆ విధంగా బ్రిడ్జ్ మరియు “వ్యూ పాయింట్” ల మద్య ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి “ఫ్లోటింగ్ బ్రిడ్జ్” తెగిపోయిందన్న వార్త సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారని గుర్తించినట్లు తెలిపారు. ఇది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్తవం అన్నారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుండి దాని “T” జంక్షన్ వ్యూ పాయింట్ ను సాధారణ మాక్ డ్రిల్ల్స్ లో భాగంగా మాత్రమే విడదీసి వేరు చేశాం. సముద్ర ప్రవాహాలు తీవ్రంగా (హై టైడ్) ఉన్నప్పుడు ఇది సాదారణంగా చేపట్టే సాంకేతిక పరిశీలనలో భాగమని, భవిష్యత్తులో కూడా అవసరమైతే ఇటువంటి మాక్ డ్రిల్ల్స్ ను చేపడతామని స్పష్టం చేశారు. జరుగుతుందని తెలియజేయడమైనది.
అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి, వైవీ సుబ్బారెడ్డి
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్ధేశంతో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ తరహా ప్రాజెక్టులు అనేకం బీచ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రారంభించిన మరుసటి రోజు ఉదయమే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకం పనులు, నాసిరకం పాలనకు ఫ్లోటింగ్ బ్రిడ్జే నిదర్శనమంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరిన్ని చూడండి