Dhruv Jurel Makes History In Ranchi: రాంచీ(Ranchi) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ ధ్రువ్ జురెల్(Dhruv Jurel) అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. జురెల్ పోరాటంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 17వ టెస్ట్ సిరీస్ విజయాన్ని భారత్ ఖాతాలో వేసుకుంది.
రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసిన ధృవ్ నాటౌట్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన ధృవ్ జురేల్ 90 పరుగులతో చెలరేగాడు. దీంతో ధృవ్ జురేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో జురేల్ చరిత్ర సృష్టించాడు. గత 22 ఏళ్లలో అరంగేట్ర టెస్ట్ సిరీస్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల ఒడిసిపట్టుకున్న ధృవ్ సత్తా చాటుతున్నాడు.
కల సాకారమైందన్న జురెల్
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ధ్రువ్ జురెల్..తన ప్రదర్శనపై స్పందించాడు. మ్యాచ్ సమయంలో తనకు ఇలానే ఆడాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదని ధ్రువ్ చెప్పాడు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని… బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నానని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్.. తన మొదటి సిరీస్ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని తెలిపాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల అని. ఇప్పుడు నెరవేరడం సంతోషంగా అనిపిస్తోందన్నాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనను మరో ధోనీ అంటూ పొగడడం ఆనందంగా ఉందని ధ్రువ్ తెలిపాడు. నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 39 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ త్వరగా ఔట్ అయినా శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్ లు ఇంగ్లాండ్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు అభేధ్యమైన ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించి భారత్‌కు విజయాన్ని అందించారు.
జురెల్‌పై ప్రశంసల జల్లు
టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన జురెల్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జురెల్‌ను చూస్తుంటే మరో ధోనీలా కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. ధ్రువ్ జురెల్ ఏకాగ్రతలో మరో ధోనీని తలపిస్తున్నాడని గవాస్కర్ అన్నాడు. శతకం చేజారినాఉం ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడని గవాస్కర్ అన్నాడు. బ్రిటీష్ జట్టుపై ఘన విజయం సాధించిన అనంతరం భారత జట్టు సారధి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు.