ByGanesh
Tue 27th Feb 2024 04:11 PM
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకారం.. రెండే రెండు పార్టీలున్నాయి. ఒకటేమో వైఎస్సార్‌సీపీ.. రెండోది చంద్రబాబు పార్టీ. ఈ చంద్రబాబు పార్టీ ఏంటంటారా? దీనిలోకే అన్నీ వస్తాయన్న మాట. జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు.. ఇంకేమైనా ఉంటే అవి. విపక్ష నేతలందరికీ చంద్రబాబు స్క్రిప్ట్ రైటర్ అన్నమాట. ఇదంతా ఎవరో చెబుతున్న మాట కాదండోయ్.. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చేసి చంద్రబాబు దత్తపుత్రుడు. ఇక షర్మిలమ్మ వచ్చేసి చంద్రబాబుకు నమ్మిన బంటు. ఇక బీజేపీ రాష్ట్ర చీఫ్ భువనేశ్వరి వచ్చేసి బావ కళ్లలో ఆనందాన్ని చూడటం కోసం ఏమైనా చేసే వదినగారు.
బీజేపీలో చేరి ఏం చేస్తారు?
పొద్దున లేచి లేవగానే జగన్ స్టార్ట్ చేస్తారు.. అంతా చంద్రబాబు వర్గమేనంటారు. గతంలో అయితే బీజేపీ నేతలను విమర్శించేందుకు సాహసమే చేసేవారు కాదు. ఇప్పుడు జగన్‌తో పాటు ఆయన పార్టీ నేతలంతా బీజేపీ రాష్ట్ర చీఫ్‌పై ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి బీజేపీ అధిష్టానం కూడా సైలెంట్‌గా ఉండటం గమనార్హం. ఇప్పుడు కొత్తగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే.. ‘ఎవరైనా బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని ఏపీలో సిద్ధమైతే.. కమలం పార్టీలో ఎందుకు? దీనిలో చేరి ఏం చేస్తారు? వద్దే వద్దు… వెళ్లి టీడీపీలో చేరండి’ అని పురందేశ్వరి సలహా ఇస్తున్నారట. జగన్ సైన్యం కొత్తగా స్టార్ట్ చేసిన ప్రచారం. ఒక పార్టీ చీఫ్ అయ్యుండి అలా ఎవరైనా చెబుతారా?
సొంత పార్టీ కల్లోలం రేపుకుంటారా?
ఇక ఈ విషయాలన్నీ పక్కనబెడితే పురందేశ్వరి బీజేపీకి నేడో రేపో రాజీనామా చేస్తారట. ఆమె కూడా టీడీపీలోకి వెళ్లిపోతారట. ఇదొక ప్రచారం. సరే.. చంద్రబాబు చెప్పినట్టే పురందేశ్వరి చేస్తున్నట్టైతే ఆమె రిజైన్ చేసి టీడీపీలోకి రమ్మని ఈ తరుణంలో చంద్రబాబు ఎందుకు చెబుతారు? ప్రస్తుతం పార్టీలో ఉన్నవారికే టికెట్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. జనసేనకు కొన్ని సీట్లు పోగా.. బీజేపీకి కొన్ని పోగా టీడీపీకి ఎన్ని మిగులుతాయో కూడా తెలియదు. ఇచ్చిన 95 స్థానాలకే నేతలు చాలా మంది అలకబూనారు. వారికి సర్ది చెపుకునేందుకే చంద్రబాబుకు సమయం చాలడం లేదు. కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించి మరీ సొంత పార్టీ కల్లోలం రేపుకుంటారా? బీజేపీ కూడా పొత్తులోనే ఉంటుందంటున్నారు కాబట్టి ఆ పార్టీ నుంచే పోటీ చేయమని చెబుతారు. వినేవారుంటే వైసీపీ వాళ్లు ఎన్నైనా చెబుతారు.
Is this a bad campaign against Purandeshwari?:
Jagan is criticizing Purandeshwari