No10 And No11 Scored A Century : దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నమెంంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024) లో అద్భుతం ఆవిష్కృతం అయింది. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే ఘటన జరిగింది. రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ముంబై టెయిలెండర్లు చారిత్రక ప్రదర్శన చేశారు. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై 10, 11వ నంబర్ ఆటగాళ్లు సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తనుశ్ కోటియన్ 129 బంతుల్లో 120 నాటౌట్… 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తుషార్ దేశ్‌పాండే 129 బంతుల్లో 123 పరుగులతో సెంచరీలు చేసి చరిత్రపుటల్లోకెక్కారు. వీరిద్దరు కలిసి పదో వికెట్‌కు 249 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. రంజీ ట్రోఫీ చరిత్రలో 10, 11వ నంబర్ బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి.
భారత క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. 1946లో సర్రే జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు చెందిన 10, 11వ నంబర్ బ్యాటర్లు కూడా సెంచరీలు చేశారు. ఆ మ్యాచ్‌లో భారత టెయిలెండర్లు షుటే బెనర్జీ, చందు సర్వతే సెంచరీలు సాధించగా.. ఇప్పుడు ముంబై టెయిలెండర్లు తనుశ్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే ఈ అరుదైన రికార్డును నెలకొల్పారు. తనుశ్ -తుషార్ జోడీ శతకాల మోత మోగించడంతో బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ ఆధిక్యాన్ని సాధించింది.
మ్యాచ్ సాగుతోందిలా..
రంజీ క్వార్టర్ మ్యాచ్‌లో ముంబై, బరోడా జట్లు తలపడ్డాయి. తనుశ్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే శతకాలతో ముంబై సెకండ్ ఇన్నింగ్స్‌లో 569 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 36 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని బరోడా ముందు 602 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. 602 పరుగుల లక్ష్య చేధనలో బరోడా జట్టు పూర్తి ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 384, బరోడా 348 పరుగులు చేసింది. ఒక వేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో ముంబై జట్టు సెమీస్ చేరనుంది.
వారిద్దరిపై చర్యలు తప్పవా
రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి దూరంగా ఉన్న భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్(Ishan Kishan), శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై బీసీసీఐ( BCCI ) కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ టోర్నమెంట్‌లో పాల్గొనని వీరిద్దరిని 2023-24 సీజన్ కేంద్ర కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇషాన్, అయ్యర్ భిన్నమైన కారణాలతో రంజీ ట్రోఫీలో ఆడలేదు. ఐపీఎల్ కోసం తన టెక్నిక్‌పై పని చేస్తున్నానని ఇషాన్ చెప్పగా.. వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు అయ్యర్ తెలిపాడు. అయితే ఇషాన్, అయ్యర్ వ్యవహార శైలి పట్ల సంతృప్తిగా లేని బీసీసీఐ వీరిద్దరికి సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలగించాలని చూస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరి పేర్లను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ ఇస్తున్న సెంట్రల్ కాంట్రాక్ట్ 2023లో శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ బిలో ఉండగా ఇషాన్ కిషన్ గ్రేడ్ సిలో ఉన్నారు. ఈక్రమంలో శ్రేయస్ రూ.3 కోట్ల వార్షిక వేతనాన్ని పొందుతుండగా ఇషాన్ కోటి జీతం అందుకుంటున్నాడు. బోర్డు ఆదేశాలను వీరిద్దరు బేఖారతు చేస్తూ రంజీల్లో ముంబైకి అయ్యర్, జార్ఖండ్‌కు కిషన్ అందుబాటులో ఉండడం లేదు. అతి త్వరలోనే బీసీసీఐ 2024కు సంబంధించిన కాంట్రాక్ట్స్‌లను ప్రకటించనుంది.