Narendra Modi to Address Meetings in Telangana: ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తెలంగాణకు రానున్నారు. ఈ నెల 4వ తేదీన ప్రధాని మోదీ ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు.
అధికారిక కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ
ఈనెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు నాందేడ్ నుంచి ఆదిలాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు. అనంతరం జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అధికారిక కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ ఉంటుందని అన్నారు. ఆదిలాబాద్ – బేల మహారాష్ట్ర వైపు వెళ్తున్న రహదారిని అభివృద్ధి చేసేందుకు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఈ పనులకు ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారని తెలిపారు. అలాగే ఆదిలాబాద్ పట్టణంలో మౌలిక సదుపాయాలు అండర్ గ్రౌండ్ మురుగునీటి పారుదల, మంచినీటి వ్యవస్థ వంటి వాటికి అమృత్ పథకం కింద 250 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఆ పనులకు కూడా శంకుస్థాపన, రామగుండం 800మెగావాట్ల విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారని తెలిపారు.
ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్ మంజూరు చేస్తారా?
అనంతరం 11 గంటలకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించనున్నారు. ఈ సభకు కేంద్ర మంత్రులు, ముఖ్య నాయకులు వస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న తరుణంలో జిల్లాకు పలు వరాలు ఇచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్ మంజూరు చేయడంతో పాటు ఆసియాలోనే అతిపెద్ద కాటన్ మార్కెట్ అయిన ఆదిలాబాద్ కు టెక్స్ టైల్స్ పార్కును ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. గత ప్రభుత్వాల కారణంగా నాయకుల అలసత్వం కారణంగా ఆదిలాబాద్ కు రావాల్సిన టెక్స్ టైల్స్ పార్క్ వేరే జిల్లాలకు తరలిపోయిందని అన్నారు.
రేవంత్ రెడ్డితో బీజేపీ నేత చర్చలు
ఎయిర్ పోర్ట్ విషయమై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోను తాను మాట్లాడడం జరిగిందని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అభివృద్ది కోసం అదిలాబాద్ జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రధాని రాకతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపి జిల్లా నాయకులు అంకత్ రమేష్, ఆదినాథ్, లాలా మున్నా, చిలుకూరి జ్యోతి రెడ్డి, ఆకుల ప్రవీణ్, జోగురవి, మహేందర్, రఘుపతి కృష్ణ యాదవ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: పారిశుద్ధ్య కార్మికుల సొమ్ము స్వాహా – రూ.86లక్షలు కాజేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది
మరిన్ని చూడండి