Top Headlines On March 3rd In Telugu States:
1. గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా హైదరాాబాద్!
హైదరాబాద్ (Hyderabad)లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను.. హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఆవిష్కరించేందుకు సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర రాజధాని శివారును ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని నిర్దేశించారు.
2. తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల మోత
ఎల్ నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే వరకూ సాధారణం కంటే అధిక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా వేశారు.
3. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డ్ పరీక్షల (TS Inter Board Exams)కు హాజరవుతున్న ఇంటర్ విద్యార్థులకు కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న నిమిషం నిబంధనను కాస్త సడలించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లో అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆత్మహత్యలతో స్పందించిన ఇంటర్ బోర్డు నిమిషం నిబంధనను సడలిస్తూ.. ఐదు నిమిషాల వరకు ఊరట కలిగిస్తున్నట్లు వెల్లడించింది.
4. టీడీపీలోకి ముగ్గురు కీలక నేతలు
తెలుగుదేశం(Telugudesam) పార్టీ ఒక్కసారిగా గేరుమార్చింది. రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికార పీఠం దక్కించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే వందమంది కూటమి సభ్యులను ప్రకటించి అధికార పార్టీకి సవాల్ విసిరిన చంద్రబాబు(Chandra Babu)… శనివారం ఒక్కరోజే వైసీపీ(YCP)కి చెందిన ముగ్గురు కీలక నేతలను పార్టీలో చేరనున్నారు. వసంతకృష్ణప్రసాద్, లావు శ్రీకృష్ణదేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర్ శనివారం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
5. వైసీపీ ఇంఛార్జీల 9వ జాబితా విడుదల
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అధికార పార్టీ వైఎస్సార్ సీపీ 9వ జాబితా విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఇంఛార్జ్‌గా, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని నియమించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని నియమిస్తూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో గంజి చిరంజీవిని మంగళగిరికి సమన్వయకర్తగా నియమించగా.. తాజాగా ఆయనను తప్పిస్తూ, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్యకు అవకాశం ఇచ్చారు జగన్.
6. ఏపీలో మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ విడుదల
ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో (Mode Schools) ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడింది. విద్యార్థులు మార్చి 1 నుండి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
7. జేఈఈ మెయిన్స్ దరఖాస్తుకు నేడే ఆఖరు
జేఈఈ మెయిన్స్ చివరి విడత దరఖాస్తుకు గడువు శనివారంతో ముగియనుంది. ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య ఆన్ లైన్ పరీక్షలు జరుగుతాయని గతంలోనే జాతీయ పరీక్షల సంస్థ ప్రకటించింది. తొలి విడతకు 12.21 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 11.70 లక్షల మంది పరీక్ష రాశారు. చివరి విడత పూర్తైన తర్వాత ఏప్రిల్ 20న ర్యాంకులు వెల్లడిస్తారు.
8. రామేశ్వరం కేఫ్ లో పేలుడు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శనివారం భారీ పేలుడు అలజడి సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. HAL పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. నిత్యం రద్దీతో ఉండే రామేశ్వరం కేఫ్‌లో ఈ ప్రమాదం జరగడం సంచలనమైంది. గాయపడ్డ వాళ్లలో ముగ్గురు కేఫ్ సిబ్బందితో పాటు ఓ కస్టమర్ ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో కేఫ్‌లో ఓ బ్యాగ్ పెట్టారని, అందులో పేలుడు పదార్థం ఉందని అనుమానిస్తున్నారు.
9. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక
వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్, స్టార్ క్రికెటర్స్ హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ వేదిక గుజరాత్ లోని జూమ్ నగర్ సందడిగా మారింది. స్టార్ పాప్ సింగర్ రిహాన్నా స్పెషల్ షో, ఇల్యూజనిస్ట్ డేవిడ్ బ్లెయిన్ ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది.
10. ఇక దేశవాలీలో మహిళల హోరు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీసీసీఐ(BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుణె వేదికగా మహిళలకూ రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 11 వరకు సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఒక్కో మ్యాచ్ మూడు రోజులపాటు జరగనుండగా….2018లో రెండు రోజుల మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహించింది. ఈ టోర్నీకి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
మరిన్ని చూడండి