Officials Shock To Former Minister Mallareddy: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Malla Reddy) అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ (HMDA) లే అవుట్ లో ఆయనకు సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇక్కడ 2,500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణలపై కలెక్టర్ దృష్టి సారించారు. అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించగా.. ఆ రోడ్డును అధికారులు తొలగించారు.
‘నన్ను టార్గెట్ చేశారు’
అయితే, అధికారులు తన కాలేజీ రోడ్డును తొలగించడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలనే కొంత మంది టార్గెట్ చేశారని అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. హెచ్ఎండీఏ (HMDA) అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజీకి రోడ్డు వేశామని స్పష్టం చేశారు. 2,500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడతారని అన్నారు. ఇకపై తమ కాలేజీ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని పేర్కొన్నారు.
Also Read: Komati Reddy Chit Chat : యాదాద్రి కాదు ఇక యాదగిరి గుట్ట – త్వరలో జీవో ఇస్తామన్న మంత్రి కోమటరెడ్డి
మరిన్ని చూడండి