Shreyas Iyer departs for 3 in semi-final clash against Tamil Nadu: బీసీసీఐ కన్నెర్ర చేయడంతో దేశవాళీలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2023-24 సీజన్ సెకెండ్ సెమీఫైనల్లో ముంబై, తమిళనాడు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై తరపున బరిలోకి దిగిన అయ్యర్ (Shreyas Iyer) విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. 8 బంతుల్లో 3 రన్స్ చేశాడు. అనంతరం వారియర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ముంబై జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ముంబై 22 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు స్పిన్నర్ సాయికిషోర్ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ అజింక్యా రహానే(19) మోహిత్ అవస్థి(2), శామ్స్ ములానీ(0)లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. హార్దిక్ తమొరె(8 నాటౌట్), శార్ధూల్ ఠాకూర్(8 నాఔట్)లు ముంబైని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో, ముంబై జట్టు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
ఆగార్కర్ కోపం వల్లేనా..?
రంజీ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తరఫున ఆడాలని బీసీసీఐ(BCCI) కోరగా ఫిట్‌నెస్‌తో లేనని తెలిపాడు. బీసీసీఐ మాట పెడచెవిన పెడుతూ ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోల్‌కతా జట్టుతో చేరి అయ్యర్ ప్రాక్టీస్ చేశాడు. దీనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయాన్ని కారణంగా చూపి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అయ్యర్ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంతో అతడిపై వేటు పడింది.
దిగొచ్చిన అయ్యర్
దేశవాళీ టోర్నీల్లో స్టార్ క్రికెటర్లు ఆడకపోవడంపై బీసీసీఐ(BCCI) కన్నెర్ర చేయడంతో ఆటగాళ్ల తీరు మారుతోంది. బీసీసీఐ హెచ్చరికలతో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెమీఫైనల్లో ఆడుతున్నాడు. తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి అయ్యర్‌ను ముంబై సెలక్టర్లుఎంపిక చేశారు. మార్చి మూడు నుంచి జరుగబోయే రంజీ సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ముంబై రంజీ టీమ్‌కు అయ్యర్ సమాచారం ఇచ్చాడు. రంజీ సెమీఫైనల్స్‌లో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని అయ్యర్ స్పష్టం చేశాడు. దీంతో అయ్యర్‌ను టీంలోకి తీసుకుంటూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్(IPL)లో వస్తున్న ఆదరణ, డబ్బుతో యువ క్రికెటర్లు రంజీ మ్యాచ్(Ranji Match)లు అంటేనే తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజీలు ఆడడానికి అయిష్టత చూపించిన ఇషాన్ కిషన్, శ్రేయస్స్ అయ్యర్… ఐపీఎల్ ఆడేందుకు మాత్రం సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ(BCCI) కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమైంది.
భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు.. ఐపీఎల్ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని ఇషాన్, వెన్నునొప్పితో రంజీ ఆడని ఆయ్యర్‌పై బీసీసీఐ టీమ్ మేనేజ్‌మెంట్ ఆగ్రహంగా ఉంది. దేశవాళీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీఐ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. ఈ అల్టీమేటంతో అయ్యర్ దారిలోకి వచ్చాడు.