Telangana BJP : : తెలంగాణ బీజేపీలో టికెట్ల కేటాయింప అసంతృప్తి పెరుగుతోంది. ఇన్నాళ్లూ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారికి కాకుండా.. కొత్తగా చేరిన వారికే టిక్కెట్లు కేటాయిస్తున్నారు. దీంతో పలువురు అసంతృప్తికి గురై పక్క చూపులు చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన తాజా ఎంపీ బీబీ పాటిల్‌కు రాత్రికి రాత్రే టికెట్ కన్ఫర్మ్ చేశారు. నాగర్ కర్నూలు పోతుగంటి రాములు కుమారుడికీ అలాగే చాన్స్ ఇచ్చారు. దీంతో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న శ్రేణుల ఆగ్రహానికి రాష్ట్ర నాయకత్వం గురవుతున్నది.
ఈటలకు మల్కాజిగిరి టిక్కెట్‌తో సీనియర్ నేతల తీవ్ర అసంతృప్తి
అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన ఈటల రాజేందర్ కు మల్కాజిగిరి టిక్కెట్ కేటాయించారు. తనకు మల్కాజిగిరి స్థానం దక్కకపోవటంపై పార్టీలో హార్డ్‌కోర్ నాయకుడిగా పేరున్న మురళీధర్‌రావు అలకపాన్పు ఎక్కటం ఇబ్బందిగా మారింది. ఈటలకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కూన శ్రీశైలంగౌడ్, తూళ్ల వీరేందర్‌గౌడ్ బీజేపీని వీడుతారనే చర్చ నడుస్తున్నది. మరోవైపు ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ కీలక నేతలు ఈటలకు వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి తనకు నాగర్ కర్నూల్ స్థానం కేటాయించకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నేండ్లు పార్టీ కోసం కష్టపడిన తనను కాదని భరత్‌కు ఇవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారబోతున్నారనే చర్చా మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డిని ఆమె కలవడం దానికి మరింత బలం చేకూరింది.
తీవ్ర అసంతృప్తిలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ
సోయం బాపూరావు(ఆదిలాబాద్), డీకే అరుణ (మహబూబ్‌నగర్), రఘునందన్‌రావు(మెదక్) తమకు ఇంకా టికెట్ ఖరారు చేయకపోవడంపై అసంతృప్తిలో ఉన్నారు. మెదక్ నుంచి ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతను రంగంలోకి దింపాలనే యోచనతోనే రఘునందన్‌రావును నాయకత్వం పక్కన బెట్టినట్టు తెలిసింది. ఒకవేళ టికెట్టు దక్కకపోతే వారు పార్టీలో ఉండటమూ కష్టమే. తరుచూ గిరిజనులకు వ్యతిరేకంగా నోరుపారేసుకోవడం, సొంతింటికి ఎంపీ నిధులను ఉపయోగించుకున్నారనే ఆరోపణలు రావటం, పార్టీ శ్రేణులను కలుపుకుని పోకుండా ఒటెత్తు పోకడలకు పోవడం వంటి వాటివల్లనే బాపూరావుకు అభ్యర్థిత్వం ఖరారు కాలేదనే చర్చ బీజేపీలో నడుస్తున్నది. ఆ స్థానం నుంచి మాజీ ఎంపీలు రమేశ్‌రాథోడ్, నగేశ్‌లలో ఒకరిని బరిలోకి దింపాలనే నిర్ణయానికి జాతీయ నాయకత్వం వచ్చింది.
నల్లగొండ, ఖమ్మం నుంచి వలస నేతలకు చాన్స్
నల్లగొండ నుంచి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని, ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్ ఎంపీ నామానాగేశ్వర్‌రావును, మహబూబాబాద్ నుంచి తాజా బీఆర్‌ఎస్ ఎంపీ కవిత కాదంటే హుస్సేన్ నాయక్, వరంగల్ నుంచి ఆరూరు రమేశ్‌ను రంగంలోకి దింపాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర కీలక నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కారణంగాేన ఆ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అయితే ఆయా స్థానాల్లో బీజేపీ కోసం పని చేసిన వారు అసంతృప్తికి గురవుతున్నారు.
మరిన్ని చూడండి