నటసింహం నందమూరి బాలకృష్ణకు దర్శకుల హీరోగా పేరుంది. ఒకసారి కథ నచ్చి, సినిమాకి ఓకే చెప్పేస్తే.. పూర్తిగా డైరెక్టర్ కి సరెండర్ అయిపోతారు బాలయ్య. ఈ క్రమంలో ఆయనకు ఘన విజయాలతో పాటు, ఘోర పరాజయాలు కూడా ఎదురయ్యాయి. అయితే విజయాలు వచ్చినప్పుడు దర్శకులను ప్రశంసిస్తారు కానీ.. ఏనాడు ఫలానా డైరెక్టర్ వల్ల సినిమా ఫ్లాప్ అయిందని బాలకృష్ణ విమర్శించిన సందర్భాలు లేవు. దర్శకుడికి అంత గౌరవం ఇస్తారు బాలయ్య. డైరెక్టర్ అనే కాదు.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో మంచిగా ఉంటారు. సాయం చేయడంలోనూ ముందుంటారు. అందుకే “బాలయ్య మనసు బంగారం” అని ఆయనను సినీ పరిశ్రమలో దగ్గర నుంచి చూసినవాళ్ళందరూ అంటుంటారు. అలాంటి బాలకృష్ణపై ఓ దర్శకుడు నోరు పారేసుకున్నాడు. దీంతో బాలయ్య అభిమానులు ఆయనపై విరుచుకుపడుతున్నారు.
తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కి ఘోర పరాజయాలు ఎదురైనప్పుడు తమిళ హీరోలే ఆయనకు అవకాశాలు ఇవ్వలేదు. అలాంటి సమయంలో బాలకృష్ణ పిలిచి మరీ ఆయనకు వరుసగా రెండు అవకాశాలు ఇచ్చారు. వీరి కాంబినేషన్ లో 2018లో ‘జై సింహా’, 2019లో ‘రూలర్’ సినిమాలు వచ్చాయి. ‘జై సింహా’ విజయం సాధించగా, ‘రూలర్’ డిజాస్టర్ గా నిలిచింది. ‘రూలర్’ సినిమాపైనా, అందులోని బాలకృష్ణ పోలీస్ గెటప్ పైనా దారుణమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. అయినా బాలయ్య ఎప్పుడూ కె.ఎస్. రవికుమార్ ని ఒక్క మాట కూడా అనలేదు. అయినప్పటికీ రవికుమార్ తమిళనాడులో బాలయ్యపై జోకులు వేసుకొని పబ్బం గడుపుతున్నారు.
తాజాగా ‘గార్డియన్’ అనే తమిళ సినిమా ప్రెస్ మీట్ హాజరైన కె.ఎస్. రవికుమార్ బాలయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ లో ఎవరైనా నవ్వుతున్నట్టు కనిపిస్తే.. తనను చూసే నవ్వుతున్నారనుకొని బాలకృష్ణకు కోపం వస్తుందని.. వెంటనే ఆ వ్యక్తిని పిలిచి కొడతారని రవికుమార్ అన్నారు. ఒకసారి నా అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ అనుకోకుండా ఫ్యాన్ ని బాలకృష్ణ వైపు తిప్పడంతో.. ఆయన విగ్గు ఎగిరిపోయింది. అది చూసి శరవణన్ చిన్నగా నవ్వడంతో.. బాలకృష్ణకు కోపమొచ్చి అతనిపై గట్టిగా అరిచారు. ఎక్కడ కొడతారోనన్న భయంతో నేనే శరవణన్ ని అక్కడినుంచి పంపించానని రవికుమార్ చెప్పుకొచ్చారు.
బాలకృష్ణపై రవికుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. సీనియర్ దర్శకుడు అయ్యుండి కనీస జ్ఞానం లేకుండా.. వేరే సినిమా వేడుకలో ఒక పెద్ద హీరో గురించి ఇలాంటి కామెంట్స్ ఏంటని అందరూ ఆయనను తప్పుబడుతున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అవకాశాలు లేనోడిని పిలిచి రెండు సినిమా అవకాశాలు ఇస్తే.. ఇప్పుడు అవకాశమిచ్చిన హీరోపైనే జోకులు వేస్తున్నాడు. అసలు ఇలాంటి విశ్వాసం లేని వారిని బాలయ్య దగ్గరకు కూడా రానివ్వకూడదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.