భారీ సినిమాలు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం సహజం. అయితే సినిమా ఎప్పుడో మొదలై, ఎప్పటికి పూర్తవుతుందో తెలియకపోతే మాత్రం అభిమానులు ఎంతో నిరాశ చెందుతారు. ‘గేమ్ ఛేంజర్’ విషయంలో రామ్ చరణ్ అభిమానులు చాలాకాలంగా అలాంటి నిరాశనే ఎదుర్కొంటున్నారు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే డైరెక్టర్ శంకర్ మధ్యలో ‘ఇండియన్-2’తో బిజీ కావడంతో ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎప్పుడో 2021లో మొదలైన ఈ సినిమా.. 2024 వచ్చినా ఇంకా పూర్తి కాలేదు. ఈ ఏడాది డిసెంబర్ లో సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతున్నా ఫ్యాన్స్ నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈ సినిమా నుంచి కనీసం సరైన అప్డేట్స్ కూడా లేవు. గతేడాది రామ్ చరణ్ బర్త్ డేకి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప.. ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే సరిగ్గా ఏడాదికి ఈ మూవీ నుంచి మరో అప్డేట్ రాబోతుంది.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఆరోజు ‘గేమ్ ఛేంజర్’ నుంచి గ్లింప్స్ విడుదల కావడంతో పాటు.. మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అలాంటివేం లేవని.. కేవలం ఫస్ట్ సాంగ్ మాత్రమే రిలీజ్ కానుందని న్యూస్ వినిపిస్తోంది. నిజానికి ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘జరగండి జరగండి’ అనే సాంగ్ ఎప్పుడో లీక్ అయింది. దీనిని ఫస్ట్ సింగిల్ గా దీపావళి కానుకగా గతేడాది నవంబర్ లోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఎందుకనో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సాంగ్ ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దీంతో చరణ్ ఫ్యాన్స్.. మేకర్స్ పై మండిపడుతున్నారు.
లాస్ట్ ఇయర్ బర్త్ డేకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఇయర్ బర్త్ డేకి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తాం అంటున్నారు. ఈ లెక్కన 2025 బర్త్ డేకి టీజర్, 2026 బర్త్ డేకి ట్రైలర్ విడుదల చేసి.. సినిమాని 2027లో విడుదల చేస్తారా అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఫ్యాన్స్ బాధని అర్థం చేసుకొని.. మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. ఎప్పటికప్పుడు సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి.