Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. లోక్‌సభ స్ధానాల వారీగా పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాలకు బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. అయితే ప్రతిపక్షంలో ఉండటంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించిన స్థానాల నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌లోని నేతలు ఆసక్తి చూపడం లేదు.
పోటీ చేయలేనన్న అమిత్ రెడ్డి!
నల్లగొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని భావించిన బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేసినట్లు సమాచారం. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ రెండు జిల్లాల్లో ఎక్కువగా సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ కంచుకోటగా ఆ రెండు జిల్లాలు చెబుతూ ఉంటారు. దీంతో ఆ రెండు సీట్లల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆ రెండు స్థానాలకు బీఆర్ఎస్‌లో అభ్యర్థులు కరువయ్యారు. పలువురు నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. వారికి అంత బలం లేకపోవడంతో సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ఇన్నాళ్లు టికెట్ కావాలని పట్టుబడిన కొంతమంది నేతలు ఇప్పుడు పోటీకి నిరాకరించడంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తోంది.
పోటీ నుంచి తప్పుకున్న సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి
ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇక ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ మాలోక్ కవిత కూడా పోటీ చేసేందుకు తొలుత ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అయితే చివరికి అధిష్టానం సూచనతో పోటీకి అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం నల్లగొండ, భువనగిరి స్థానాల్లో అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ వెతుకులాట మొదలుపెడుతోంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలిచారు.
ఆలేరు, నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవగా.. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇక ఆదిలాబాద్ స్థానం నుంచి కూడా బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు నేతలెవ్వరూ మందుకు రావడం లేదు. దీంతో ఆ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంపై కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లను బీఆర్ఎస్ కేటాయించనుంది.
మరిన్ని చూడండి