ఒక స్టార్ హీరో సినిమా స్టార్ట్ అయ్యిదంటే దాని వెనుక ఎంతో కథ ఉంటుంది. ముఖ్యంగా ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తే తనకు వర్కవుట్ అవుతుంది అనే విషయంలో హీరో తీసుకునే నిర్ణయమే కీలకంగా మారుతుంది. డైరెక్టర్ చెప్పిన కథ తనకు సూట్ అవుతుందా, అందులో తన క్యారెక్టర్‌ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే దాని గురించి నిర్ణయం తీసుకోవడంలోనే సగం సక్సెస్ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఒక హీరో రిజెక్ట్ చేసిన కథని మరో హీరో యాక్సెప్ట్ చేసి సూపర్‌హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన హీరో డిజాస్టర్‌ని అందుకున్న సందర్భాలూ ఉన్నాయి.
అలా కొన్ని కథలను రిజెక్ట్ చేసిన హీరోల జడ్జిమెంట్ కొన్నిసార్లు కరెక్ట్ అయింది, మరికొన్ని సార్లు తప్పు అని తేలింది. ఆ వివరాల్లోకి వెళితే… చిరంజీవి కెరీర్‌ని మలుపు తిప్పి ‘ఖైదీ’ చిత్రాన్ని మొదట సూపర్‌స్టార్ కృష్ణతో చేద్దామనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేసే అవకాశం చిరంజీవికి వచ్చింది. ‘నువ్వే కావాలి’ సినిమాను మొదట పవన్ కళ్యాణ్‌తో చెయ్యాలనుకున్నారు. కానీ, ఆ కథ పవన్ ఇమేజ్‌కి సెట్ అవ్వదన్న ఉద్దేశంతో పక్కన పెట్టారు. చివరకు తరుణ్‌తో ఆ సినిమా చేసారు. ఆ సినిమా ఎలాంటి ట్రెండ్‌ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
డైరెక్టర్ సుకుమార్ తన మొదటి సినిమా ‘ఆర్య’ కథను ముందుగా ఎన్టీఆర్‌కు వినిపించారు. కథ నచ్చింది. కానీ, తనకు అది సెట్ అవ్వదని భావించిన ఎన్టీఆర్ దాన్ని రిజెక్ట్ చేశాడు. అదే కథతో అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సాధించాడు. అలాగే ‘బొమ్మరిలు’ కథ కూడా తన ఇమేజ్‌కి సరిపోయేది కాదని భావించి దాన్ని కూడా వదిలేశాడు. అది సిద్ధార్థ్ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే మరో బ్లాక్‌బస్టర్ మూవీని కూడా ఎన్టీఆర్ కాదన్నాడు. అదే ‘భద్ర’. బోయపాటి శ్రీను తన మొదటి సినిమా కోసం కథను రెడీ చేసుకొని ఎన్టీఆర్‌కి వినిపిస్తే ఏదో కారణంతో ఆ సినిమా చేయనని చెప్పాడు. అదే కథతో రవితేజ హీరోగా రూపొందించి ఘన విజయం సాధించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ విషయంలో ఎన్టీఆర్ జడ్జిమెంట్ నిజమైంది. తను రిజెక్ట్ చేసిన కథతో నితిన్ చేసిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇటీవల వచ్చిన ‘గుంటూరు కారం’ కథను మొదట ఎన్టీఆర్‌కే వినిపించాడు త్రివిక్రమ్. అయితే ఆ టైమ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’పైనే ఎన్టీఆర్ ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్ పెట్టడంతో అది మహేష్ దగ్గరకు వెళ్లింది. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు.
అలాంటి పరిస్థితే ఎన్టీఆర్‌కి మళ్లీ ఎదురైంది. ‘ఉప్పెన’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన సానా బుచ్చిబాబు తన నెక్స్‌ట్ మూవీ కథను ఎన్టీఆర్‌కు వినిపించాడు. లైన్ నచ్చింది. చేద్దాం అన్నాడు. చాలా రోజులు అదే స్క్రిప్ట్‌పై కూర్చొని బాగా వర్కవుట్ చేశాడు బుచ్చిబాబు. అయితే ఎన్టీఆర్ డేట్స్ ఎడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆ కథతో రామ్‌చరణ్ దగ్గరికి వెళ్లాడు. చరణ్ ఆ కథను ఓకే చేశాడు. ఇప్పటివరకు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథలతో వేరే హీరోలు సినిమాలు చేసి హిట్ కొట్టినవే ఎక్కువ ఉన్నాయి. మరి ఈ కథ చరణ్‌కి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.