దిశ, ఫీచర్స్ : నడక ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఎన్ని అడుగులు నడిస్తే మంచిది? ఎంత సేపు వాకింగ్ చేస్తే సరైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనే విషయంపై గత అధ్యయనాలు ఒక వ్యక్తి రోజుకు కనీసం 10 వేల అడుగులు నడవాలని పేర్కొన్నాయి. అయితే బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ వెలువరించిన తాజా అధ్యయనం మాత్రం ప్రతి రోజు కనీసం 2,200 అడుగులు నడిస్తే చాలు, బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నది. పైగా ఇలా చేయడం వల్ల వ్యాధులు, ముందస్తు మరణాల ముప్పు తగ్గుతుందని వెల్లడించింది.
అధ్యయనంలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన పరిశోధకులు యునైటెడ్ కింగ్‌డమ్ బయోబ్యాంక్ నుంచి 61 సంవత్సరాల వయస్సు గల 70 వేలమందికి సంబంధించిన జీవనశైలి, రోజువారి నడక, ఆరోగ్యానికి సంబంధించిన డేటాను విశ్లేషించారు. అలాగే ప్రత్యక్షంగా తెలుసుకునే క్రమంలో పార్టిసిపెంట్స్ ఎక్సర్‌సైజ్ లెవల్స్ కొలవడానికి ఒక వారం పాటు యాక్సిలరోమీటర్‌ను ధరించాలని సూచించారు. ఇలా ఏడేళ్లపాటు పలువురిని పరిశీలించిన తర్వాత, 2,200 కంటే తక్కువ అడుగులు వేస్తున్న నిశ్చల జీవనశైలి కలిగిన వ్యక్తుల్లో 1,633 మరణాలు, అలాగే 6,190 గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సంఘటనలు సంభవించాయని పరిశోధకులు కనుగొన్నారు.
ఇక రోజుకు 2,200 కంటే ఎక్కువ అడగులు నడిచేవారిలో వ్యాధులు, మరణాల ముప్పు తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. దీంతోపాటు అధికంగా ఎన్ని అడుగులు ఎటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయో కూడా లెక్కించగా రోజుకు 9,000 నుంచి 10,000 అడుగులు వేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం కనీసం 21 శాతం తగ్గిందని గుర్తించారు. ఇక రోజుకు 9,700 అడుగులు వేసిన వారిలో స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాల రిస్క్ గణనీయంగా తగ్గిందని, అలాగే 9,000 నుంచి 10,500 అడుగులు నడిచేవారిలో అకాల మరణాల రేటు 39 శాతం తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు.