Indiramma Housing Scheme Guidelines: కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమల్లో భాగంగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఈ నెల 11న ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ వ్యయాన్ని 4 దశల్లో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్ నెంబర్ మేరకు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయనుంది. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వనుంది. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారునికి అందించనుంది. స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని కేటాయించనుంది. తొలి దశలో సొంత స్థలం ఉన్న లబ్ధిదారులతో ఈ పథకాన్ని ఈ నెల 11న భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
నాలుగు దశల్లో ఆర్థిక సాయం
లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం 4 దశల్లో ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
☛ బేస్ మెంట్ స్థాయిలో రూ.లక్ష
☛ రూఫ్ (పైకప్పు) స్థాయిలో రూ.లక్ష
☛ పైకప్పు నిర్మాణం తర్వాత రూ.2 లక్షలు
☛ ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష అందించనున్నారు. ప్రతి దశలోనూ అధికారులు పరిశీలన అనంతరం డబ్బు మంజురు చేస్తారు.
వీరే అర్హులు
☛ దారిద్ర్య రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న వారు, ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది.
☛ లబ్ధిదారునికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి.
☛ గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి
☛ గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా ఈ పథకానికి అర్హులు.
☛ అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమైనా, ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావొచ్చు
☛ ఒంటరి, వితంతు (విడోవర్) మహిళలూ అర్హులే.
ఇళ్ల మంజూరు ఇలా
☛ ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరు మీదే ఇస్తారు.
☛ గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
☛ ఆ జిల్లా ఇంఛార్జీ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు.
☛ లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించాకే సమీక్షించి ఖరారు చేస్తారు.
☛ జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తారు.
☛ 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం సెపరేట్ గా ఉండాలి. ఆర్ సీసీ రూఫ్ తో ఇంటిని నిర్మించాలి.
☛ లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సభల్లో ప్రదర్శిస్తారు.
ఏటా 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు కేటాయిస్తుంది. మిగిలిన 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించింది.
Also Read: Telangana News : ఢిల్లీలో రేవంత్ రెడ్డి – కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం !
మరిన్ని చూడండి
Source link