Indiramma Housing Scheme in Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) 6 గ్యారెంటీల అమల్లో భాగంగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఈ నెల 11న ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పథకానికి సంబంధించి పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తోన్న ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద కొంత మేర నిధులు సమీకరించాలని యోచిస్తోంది. కాగా, రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి గతంలోనూ కేంద్రం ఆర్థిక సాయం అందించింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి 2016 -17లో రూ.1,100 కోట్ల మేర సాయం అందింది. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మార్గదర్శకాలు వేర్వేరుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర నిబంధనలు అంత అనుకూలంగా లేవని అధికారులు పేర్కొంటున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.లక్షన్నర వరకూ కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలని నిర్ణయించగా.. కేంద్రం సాయం పోనూ రూ.3.50 లక్షలు సమకూర్చాల్సి ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.72 వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడంతో.. ఇక్కడ ఇంటి నిర్మాణాల విషయంలో కేంద్ర సహాయాన్ని తీసుకోవడంలో సందిగ్థత నెలకొంది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల సమాచారాన్ని తాజాగా కేంద్ర వెబ్ సైట్ లో అధికారులు అప్ లోడ్ చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.430 కోట్ల వరకూ కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందనున్నట్లు తెలుస్తోంది.
ఇళ్లపై రెండు లోగోలు?
పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్మించే ఇళ్లకు తాము రూపొందించిన లోగోను విధిగా ముద్రించాలన్నది కేంద్రం విధించిన నిబంధన. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం కూడా లోగోను తయారు చేయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం కింద నిర్మించే ఇళ్ల ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉన్న గోడలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లోగోలను ముద్రించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల్లోనూ ఈ అంశాన్ని పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది.
వారి పాత్రే కీలకం
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రామంలో, మున్సిపాలిటీల్లో ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలి అనే దానిపై జిల్లా ఇంఛార్జీ మంత్రుల పాత్రే కీలకం కానుంది. ఆయా జిల్లాల ఇంఛార్జీ మంత్రులే లబ్ధిదారుల ఎంపిక, ఇంటి నిర్మాణాన్ని 2 దశల్లో పరిశీలించేందుకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వం మార్గదర్శకాల్లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. చెకర్స్, మార్కర్స్ పేరిట తనిఖీ అధికారులను ఎంపిక చేయడంలోనూ ఇంఛార్జీ మంత్రుల ఆమోదం తప్పనిసరి చేసేలా చర్యలు చేపట్టనుంది.
నాలుగు దశల్లో ఆర్థిక సాయం
లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం 4 దశల్లో ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
☛ బేస్ మెంట్ స్థాయిలో రూ.లక్ష
☛ రూఫ్ (పైకప్పు) స్థాయిలో రూ.లక్ష
☛ పైకప్పు నిర్మాణం తర్వాత రూ.2 లక్షలు
☛ ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష అందించనున్నారు. ప్రతి దశలోనూ అధికారులు పరిశీలన అనంతరం డబ్బు మంజురు చేస్తారు.
వీరే అర్హులు
☛ దారిద్ర్య రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న వారు, ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది.
☛ లబ్ధిదారునికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి.
☛ గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి
☛ గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా ఈ పథకానికి అర్హులు.
☛ అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమైనా, ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావొచ్చు
☛ ఒంటరి, వితంతు (విడోవర్) మహిళలూ అర్హులే.
ఇళ్ల మంజూరు ఇలా
☛ ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరు మీదే ఇస్తారు.
☛ గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
☛ ఆ జిల్లా ఇంఛార్జీ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు.
☛ లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించాకే సమీక్షించి ఖరారు చేస్తారు.
☛ జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తారు.
☛ 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం సెపరేట్ గా ఉండాలి. ఆర్ సీసీ రూఫ్ తో ఇంటిని నిర్మించాలి.
☛ లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సభల్లో ప్రదర్శిస్తారు.