Delhi Capitals Edge Past Royal Challengers Bangalore in a Last ball Thriller: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) మరో ఉత్కంఠభరిత పోరు క్రికెట్(Cricket) అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)పై… ఢిల్లీ(DC) కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 181 పరుగుల భారీ స్కోరు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RCB నిర్ణీత ఓవర్లలో 180 పరుగులకే పరిమితమైంది. కేవలం ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.
మ్యాచ్ సాగిందిలా..
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు మెగ్ లానింగ్ 29 పరుగులు, షఫాలీ వర్మ 23 పరుగులతో.. ఢిల్లీకి పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ కేవలం 36 బంతుల్లో 8 ఫోర్లు… ఒక సిక్సుతో 58 పరుగులు చేసి రాణించింది. అనంతరం అలీస్ క్యాప్సీ 48 కూడా ధాటిగా ఆడింది. వీరి విధ్వంసంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానకిి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ శ్రేయంకా పాటిల్ నాలుగు, శోభన ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్యం దిశగా సాగినా..
182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితమైంది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో రిచా ఘోష్ రనౌట్ కావడంతో ఢిల్లీ గెలుపొందింది. రిచా ఘోష్ చివరి బంతి వరకూ పోరాడినా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. రిచా కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సులతో 51 పరుగులు చేసి చివరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగింది. బెంగళూరు గెలవాలంటే చివరి 18 బంతుల్లో 40 పరుగులు చేయాలి. ఈ దశలో ఆర్సీబీ గెలుస్తుందని ఎవరూ ఊహించనే లేదు. కానీ రిచా ఘోష్ 18, 19 ఓవర్లలో 23 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్‌లో గెలుపునకు 17 పరుగులు అవరమవ్వగా… తొలి బంతినే సిక్సుగా మలచిన రిచా… మూడో బంతికి పరుగు తీసే క్రమంలో దిశా కాసత్ రనౌట్ అయింది. లక్ష్యం మూడు బంతుల్లో 10 పరుగులుగా మారింది. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతికి రీచా మళ్లీ సిక్స్ కొట్టింది. సమీకరణం చివరి బంతికి రెండు పరుగులుగా మారింది. ఇరుజట్లతో పాటు మ్యాచ్ చూస్తున్న వారిలో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. అయితే చివరి బంతికి పరుగు తీసే క్రమంలో రిచా రనౌట్ కావడంతో ఆర్సీబీ కథ ముగిసింది. బెంగళూరు బ్యాటర్లలో ఎలిస్ పెర్రీ(49), సోఫీ మోలినెక్స్ (33), సోఫీ డివైన్ (26) విలువైన పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మారిజానె కాప్, ఎలిస్ క్యాప్సీ, షిఖా పాండే, అరుంధతీ రెడ్డి తలో వికెట్ తీశారు.