Latest Telugu breaking News: తెలుగుదేశం, జనసేన మరో విడత జాబితాను విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు దాదాపు వందకుపైగా అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పుడు మరో విడతలో 20 నుంచి 30 మంది అసెంబ్లీ, పది మంది పార్లమెంట్ సభ్యుల జాబితాను ఇవాళ విడుదల చేయనున్నారని ప్రచారం నడుస్తోంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 25 మంది అసెంబ్లీ అభ్యర్థులతోపాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు. టీడీపీ ఇప్పటికే 94 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 31 స్థానాలు కేటాయించగా మిగిలిన 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినందున ఇంకా 50 మంది పేర్లు రివీల్ చేయాల్సి ఉంది. అందులో ఇవాళ 25 మంది పేర్లు ప్రకటించనున్నారు.
బీజేపీతో పొత్తు కుదరక ముందే టీడీపీ జనసేన తమ మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. అందుకే అప్పుడు ఈ జాబితాలో ఎంపీలకు చోటు ఇవ్వలేదు. ఇప్పుడు పొత్తు ఖరారు అయినందుకు ఎంపీలకి కూడా లైన్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంది. మొదటి దశలో 10 మంది ఎంపీ అభ్యర్థులు టీడీపీ ప్రకటించనుంది.
జనసేన విషయానికి వస్తే ఇప్పటికే రెండు జాబితాల్లో ఆరుగురు అభ్యర్థులను పవన్ ప్రకటించారు. ఇవాళ మరో ఐదారుగురిని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.