‘బేబీ’, ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్‌కెఎన్. సినిమా ఈవెంట్లలో తనదైన స్పీచ్ లతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎస్‌కెఎన్.. సినీ అభిమానులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందిస్తూ ఉంటాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి సాయం చేశాడు.
పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ ఫ్యాన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటంతో.. ట్రీట్ మెంట్ కోసం తోచిన సాయం చేయండి అంటూ అమలాపురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరారు. ఈ విషయం ఎస్‌కెఎన్ వరకు చేరడంతో.. వెంటనే స్పందించిన ఆయన తన వంతుగా రూ.50,000 సాయం చేశాడు. అంతేకాదు, అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ, తారక్ గారి అభిమానులతో పాటు సినీ అభిమానులంతా అతనికి అండగా ఉండాలని కోరాడు. దీంతో ఎస్‌కెఎన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.