Avenue Court Ordered Ed Custody To Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 23 వరకూ ఆమెకు కస్టడీ విధించారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 23 వరకూ కవితను ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ రోజూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు.. ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలిచ్చింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు విక్రమ్ చౌదరి, మోహిత్ రావులు వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్, ఎన్.కే మట్టా వాదనలు వినిపించారు.

రిమాండ్ రిపోర్టులో ఏముందంటే.?

కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ పేరుతో కవిత కీలకంగా వ్యవహరించారు. లిక్కర్ విధానంలో ఆమెనే ప్రధాన లబ్ధిదారు. ఆప్ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవిత కీలక సూత్రధారి. మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో ఆమె కుట్రకు పాల్పడ్డారు. కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు. ఆయన ద్వారానే ఆమె మొత్తం వ్యవహారం నడిపించారు. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు. ఇతరులతో కలిసి రూ.100 కోట్ల లంచాలను ఆప్ నేతలకు ఆమె ఇచ్చారు. తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు. సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు. మాగుంట ద్వారా రూ.30 కోట్లను ఢిల్లీకి చేర్చారు. ఈ సొమ్మును అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు.’ అంటూ ఈడీ పేర్కొంది.

అటు, ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని కవిత అన్నారు. శనివారం ఉదయం కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈడీ నన్ను చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసు ఓ కట్టుకథ. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తాను.’ అని పేర్కొన్నారు. తనను శుక్రవారం నుంచి న్యాయవాదులతో మాట్లాడనివ్వలేదని.. మధ్యాహ్నం 2 గంటలకు తీసుకొస్తామని 11 గంటలకు తీసుకొచ్చారని అన్నారు. ఈడీ అధికారులు అధికార దుర్వినియోగం చేశారని కవిత తరఫు లాయర్లు వాదించారు.సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను ఉల్లంఘించారని.. తదుపరి విచారణ జరిగే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పారని గుర్తు చేశారు. కానీ అలా జరగలేదని.. మహిళను ఈడీ కోర్టుకు పిలవడంపై కేసు పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ కు ఈడీ కట్టుబడి లేదంటూ కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది.

Also Read: Telangana Loksabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల – ఉఫ ఎన్నిక కూడా, ముఖ్యమైన తేదీలివే!

Source link