Capital of Andhra Pradesh: విశాఖపట్నం: పదేళ్లు పూర్తి కావస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు అని, పోలవరం పూర్తవలేదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన ‘న్యాయ సాధన సభ’కు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విశాఖలో సభను చూస్తుంటే హైదరాబాద్ లో తమ పార్టీ సభలా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు వైఎస్సార్ బిడ్డ వైఎస్ షర్మిల నడుం బిగించారని.. ఉక్కు సంకల్పంతో షర్మిల ఈ సభ పెట్టారని కొనియాడారు. వైఎస్సార్ సంకల్పం నిలబెట్టేవారే ఆయన వారసులు అవుతారు కానీ అందుకు విరుద్ధంగా నడుచుకునే వారు కాదంటూ ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ వారసులు ఎవరంటే..
విశాఖ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఢిల్లీ నుంచి సుల్తానులు, జాగీర్దార్లు వచ్చినా తెలుగు గడ్డమీద ఒక్క ఇటుక పెళ్ల కూడా తీయలేరు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఏమీ చేయలేరు. వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టేవాళ్లే ఆయన వారసులు అవుతారు. వైఎస్సార్ ఆశయాలకు వ్యతిరేకంగా, ఆయన చిరకాల కోరికకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు ఎన్నటికీ దివంగత నేత వారసులు కాలేరు. ఇక్కడ ప్రశ్నించే గొంతులు లేవు. రాష్ట్ర పాలకులు ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. గత పాలకులు ఢిల్లీ నేతల్ని, కేంద్రంగా గట్టిగా నిలదీసి ఉంటే అన్నీ సాధించుకునే వాళ్లం. ఢిల్లీని డిమాండ్ చేసి కావాల్సింది సాధించుకునే నాయకత్వం ఇప్పుడు లేదు. మోదీని ఎదిరించే వాళ్లు, ఢిల్లీని ఢీకొట్టే వాల్లు లేకపోవడం వల్లే కేంద్రం నుంచి ఏదీ సాధించుకోలేకపోయాం.
10 ఏళ్లు పూర్తవుతున్నా ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం కూడా పూర్తి కాలేదు. పీవీ, జైపాల్ రెడ్డి లాంటి వాళ్లు ఎన్నో సాధించి దేశ రాజకీయాలను శాసించారు. కానీ ఇప్పుడు ఢిల్లీకి వంగి వంగి నమస్కారం చేసేవాళ్లే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ కు 1994లో ప్రతిపక్ష హోదా రాని సమయంలో వైఎస్సార్ చేతికి పగ్గాలు అప్పగించారు’ అని గుర్తుచేశారు.
మరిన్ని చూడండి