ఏపీలో బీజేపీ ఉనికి కోల్పోయినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు కాస్త అటు ఇటుగా బీజేపీ ఉనికి కోసం పోరాడినా.. ప్రస్తుతం ఏపీలో బీజేపీ కి పట్టు తగ్గింది. పురందరేశ్వరి అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తేనే జగన్ ప్రభుత్వం పడిపోతుంది, ఓట్లు చీలకుండా ఉంటాయనే అభిప్రాయంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుగా టీడీపీ తో పొత్తు పెట్టుకుని తర్వాత బీజేపీ-టీడీపీ పొత్తు కోసం పోరాడారు.
అసలు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలపడం మోడీకి నచ్చలేదు. అప్పటి నుంచి వైసీపీ కి అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనే మాట వినిపించింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫోర్స్ వల్ల పొత్తు పెట్టుకుని చంద్రబాబు, మోడీ కనిపించారు. కేవలం జగన్ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకే ఈ మూడు పార్టీలు కలిసాయి కానీ.. లేదంటే ఎవరికి వారే యమునా తీరే. అసలు బీజేపీ తో టీడీపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ పవన్ ప్రోద్భలంతో చంద్రబాబు మోడీతో చేతులు కలిపారు.
ఇక నిన్న చిలకలూరి పేటలో చంద్రబాబు-మోడీ-పవన్ కళ్యాణ్ ఇలా మూడు పార్టీల అధ్యక్షులు కలిపి సభ పెట్టారు. అక్కడ జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సభ ప్రసంగం మొత్తం జనసేన, టీడీపీ జెండాలతో నిండిపోయింది. అక్కడక్కడా మాత్రమే బీజేపీ జెండాలు ఎగిరాయి. మోడీ, బాబు, పవన్ ముగ్గురు ఈ సభలో ప్రసంగించారు. అయితే మోడీ సభకి వెళ్లొచ్చాక సోషల్ మీడియా వేదికగా తెలుగులో ట్వీట్లు వేస్తున్నారు.
పల్నాడు నుండి వచ్చిన ఈ చిత్రాలు ఎన్‌డిఎకు అధిక మద్దతు చూపుతున్నాయి. టీడీపీ, జనసేన మరియు బీజేపీలు అభివృద్ధిని అందించగలవని ప్రజలు భావిస్తున్నారని అలాగే వైఎస్సార్‌సీపీ అవినీతికి మరియు దుష్పరిపాలనకు పర్యాయపదమంటూ చేసిన ట్వీట్ చూసి ఆ సభలో అసలు బీజేపీ మద్దతు జెండాలు ఏవి మోడీ గారు, NDA బలం ఏపీలో ఎంత ఉందో ఈ సభ చూస్తే అర్ధమైపోతుంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.