Prajavani temporarily deferred in view of Lok Sabha polls 2024: హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తీసుకున్న నిర్ణయాలలో ప్రజావాణి కార్యక్రమం ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి డిసెంబర్ లోనే శ్రీకారం చుట్టారు. అయితే ప్రజావాణి కార్యక్రమాన్ని కొన్ని రోజులపాటు నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్నికల ఫలితాల తరువాతే ప్రజావాణి
మే 13న రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటించనున్నారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 6న ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగుస్తుంది. దాంతో జూన్ 7 నుంచి తిరిగి ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగించనున్నట్లు నోడల్ అధికారి వెల్లడించారు.
తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ప్రజలు ప్రభుత్వానికి ఎక్కువ వినతిపత్రాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వారానికి రెండు రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. మంగళవారం, శుక్రవారాల్లో కచ్చితంగా ప్రజావాణి నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలోనే నిర్ణయించారు. ఆ రెండు రోజుల్లో జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్‌కు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారు.
మరిన్ని చూడండి