Will Congress party merge with BRSLP : ”మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుంది”. ఇవి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలు. ఇప్పుడు అన్నంత పని చేశారు. బీఆర్‌ఎస్ నేతలు కారు దిగి హస్తం గూటికి వరుస కడుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీఆర్‌ఎస్ నేతలు బాధలో ఉన్నారు. మరోవైపు పాత వారిని కాదని బీజేపీ కొత్త వారికి టికెట్లు ఇచ్చి, పెద్ద పీట వేయడంతో ఆ పార్టీలో అంతర్గత అసంతృప్తి రగులుతున్నది. ఆ రెండు పార్టీలు అంతర్గత ఇబ్బందులను ఎదుర్కొటున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా గేట్లెత్తేయడంతో ప్రత్యర్థి పార్టీలకు ఉహించని షాకులు తగులుతున్నాయి. ఈ పరిణామాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కీలక నేతలు
చాలా రోజుల కిందటే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజుల కిందట బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ గూటికి చేరారు. ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఈ చేరికలు ఊపందుకున్నాయి. ఇదే ఊపులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు వరదలా వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలలోపు అందరూ చేరడం పూర్తి కాగానే, గ్రేటర్ నుంచి ఒకరిద్దరికి మంత్రి పదవులు కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి వీచినా, గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం కాంగ్రెస్‌కు ఎదురు గాలి వీచింది. ఈ లోటు పూడ్చుకునేందుకు చాలా కాలంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.
ఇతర పార్టీల నుంచి అయినా సరే బలమైన నేతల్ని చేర్చుకోవాలన్న లక్ష్యం !
రాష్ట్రంలో 14 సీట్లు గెలువాలనే ఎన్నికల వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాలకే అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ఆపింది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వచ్చే అవకాశం ఉండటంతో వారి కోసమే టికెట్లను ఆపిందని ఆ వర్గాలు అంటున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు కలిసి కట్టుగా బీఆర్‌ఎస్ ఎల్‌పీని సీఎల్పీలో విలీనం చేస్తారనే టాక్ వైరల్ అవుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు అసంతృప్తికి గురి కాకుండా కాంగ్రెస్ ముందుస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 37 కార్పొరేషన్లకు చైర్మెన్లను ప్రకటించి జాతరను తలపించింది. అసెంబ్లీ ఎన్నికల సమ యంలో టికెట్ దక్కని నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు చైర్మెన్ పదవులిచ్చి అసంతృప్తిని చల్లారించింది. త్వరలోనే మరికొంత మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వాన్ని పడగొడతారన్న ఆందోళనతోనే !
బీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చెవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డిని ప్రకటించినప్పటికీ ఆయన కాంగ్రెస్‌లో చేరారంటే బీఆర్‌ఎస్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ 15 పార్లమెంటు నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో రెండింటికి ప్రకటించాల్సి ఉన్నది. ఈ క్రమంలో సీటు దక్కని బీజేపీ ఎంపీ సోయంబాపూ రావు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల దగర్గ పడే కొద్దీ ఈ చేరికలు మరింత ఊపందుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మంగా ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముందుకు సాగాలని గతంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. ఇతర పార్టీ పేరుతో గెలిచిన వారిని పార్టీలో చేర్చుకోవద్దని తొలుత సూత్రపాయ నిబంధనను పెట్టుకున్నది. ప్రజలు ఇచ్చిన ఫలితాలతోనే ప్రభుత్వాన్ని నడిపించాలని భావించింది. మేలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నాయి. ఇదే టైమ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని అధికార పార్టీ.. విషయాన్ని ఢిల్లీలోని హైకమాండ్‌కు వివరించింది. పలు దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత జాయినింగ్స్‌పై దృష్టి పెట్టాలని ఏఐసీసీ నుంచి రాష్ట్ర పార్టీకి ఆదేశాలు అందాయి. సీఎం, మంత్రులు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోనే పార్టీలో చేరికల గేట్లు తెరిచామని సీఎం సైతం వెల్లడించారు.
గతంలో కాంగ్రెస్ ఎల్పీల్ని కేసీఆర్ విలీనం చేసుకున్నట్లే బీఆర్ఎస్ఎల్పీ విలీనం
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నట్లే, ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే విధానాన్ని అవలంభించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ మనుగడ కోసం చేరికలు తప్పవంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ఎల్పీ విలీనం కోసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే వరకు అధికార పార్టీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేయనున్నది. గతంలో తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని బీఆర్ఎస్ చేర్చుకున్నదని సీఎల్పీని విలీనం చేసుకున్నదని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు తాము సైతం అలాగే చేస్తామని కాంగ్రెస్ కీలక నేతల బలంగా చెబుతున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
మరిన్ని చూడండి