Telangana Crime News: హైదరాబాద్‌లోని ఇబ్రహీం పట్నం(Ibrahimpatnam)లో దారుణం జరిగింది. తను వద్దన్నప్పటికీ ప్రియుడితో మాట్లాడుతోందని కన్నకుమార్తెనే ఓ తల్లి చంపేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలోని దండుమైలారం(Dandumailaram)లో ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… మోతే జంగమ్మ, ఐలయ్యకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె పేరు భార్గవి. వయసు ఇరవై ఏళ్లు. ప్రస్తుతం ఆమె దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమె స్వగ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు.
ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే వేరే వ్యక్తితో పెళ్లి ఏర్పాట్లు చేశారు. బంధువుల అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. అదే టైంలో భార్గవని కాలేజీకి కూడా పంపించడం మానేశారు. రెండు వారాల నుంచి హౌస్ అరెస్టు లాంటిదే చేశారు.
ప్రేమ ఆమెను ఇంట్లో ఉండనీయలేదు. రెండు వారాలుగా ప్రేమికులు కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. దీంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన భార్గవి… ప్రియుడికి కబురు పెట్టింది. ఎవరూ లేని చోట వీళ్లిద్దరు మాట్లాడుతున్న విషయాన్ని తల్లి జంగమ్మ గమనించింది.
దీనిపై సోమవారమంతా గొడవ జరిగింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా భార్గవి మాట వినకపోవడంతో దారుణానికి ఒడిగట్టింది తల్లి జంగమ్మ. కుమార్తెకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించింది. అయితే ఈ విషయాన్ని చరణ్ అనే యువకుడు చూశారు.
ఇదే విషయాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులకు పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపించారు. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.
మరిన్ని చూడండి