26 BRS MLAs will join the Congress : కాంగ్రెస్ పార్టీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో చర్చలు జరిపారని, రేపో, మాపో చేరడం ఖాయం అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న ప్రజాపాలనకు ఆకర్షితులై ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయాల్సిన అవసరం తమకు లేదని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారని, ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యం అని బీర్ల ఐలయ్య వివరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటారని వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 39 మంది సభ్యులు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి మే 13వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ 38 మంది సభ్యుల్లో 26 నుంచి 30 మంది సభ్యులు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే గేట్లు తెరిచామని కాంగ్రెస్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్..చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారని ఐలయ్య చెబుతున్నారు.
కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ, బీఅర్ఎస్ లు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. బీసీలు తల దించుకునేలా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మల్కాజిగిరిలో ఈటల గెలవడానికి బీజేపీ బీఅర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకుందని, రేవంత్ రెడ్డి పై ఈటల రాజేందర్ చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. ఈటల గెలవడానికి మల్కాజ్‌గిరిలో బీఅర్ఎస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈటల గెలుపు కోసం కేసీఆర్ తురుము ఖాన్ అంటూ పొగుడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ, బీఅర్ఎస్ లు కాదా అని ఆయన ప్రశ్నించారు.
’ఫోన్ ట్యాపింగ్ లకు కాంగ్రెస్ వ్యతిరేకం.. ఫోన్ ట్యాపింగ్ ల సంస్కృతి బీజేపీ, బీఅర్ఎస్ పార్టీలది.. మా పార్టీ సంస్కృతి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనను బీజేపీ, బీఅర్ఎస్ లుజీర్ణించుకోలేకపోతున్నాయి.. మల్కాజిగిరి లో బీజేపీ, బీఅర్ఎస్ లు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి.. బీజేపీ, బీఅర్ఎస్ లు చౌక బారు రాజకీయాలు మానుకోవాలి రాష్ట్రంలో బీజేపీ, బీఅర్ఎస్ లకు డిపాజిట్లు కూడా రావు.. మత చిచ్చు పెట్టి ఓట్లు దందుకోవాలని బీజేపీ చూస్తోంది.. బీజేపీ, బీఅర్ఎస్ ల చీకటి ఒప్పందాలు ప్రజలు చూస్తున్నారు.. రేవంత్ రెడ్డిపై చిల్లర మల్లర వాఖ్యలు చేస్తున్నారు.. గతంలో గడీల పాలన ఉంటే నేడు ప్రజా పాలన కొనసాగుతోంది. ప్రజా పాలన చూసి మిగితా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తున్నారు.. ఎంపీ ఎలక్షన్ తరువాత బీజేపీ, బీఅర్ ఎస్ ఖాళీ అవుతుందన్నారు.
బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే.. మూడింట రెండు వంతుల మంది అవుతారని.. విలీనం చేసుకోవచ్చని భావిస్తున్నారు.
మరిన్ని చూడండి