పవన్ కు డూ ఆర్ డై
ఏపీ పొత్తు రాజకీయంలో పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. టీడీపీ, బీజేపీ(TDP BJP) పొత్తుకు పవన్ మధ్యవర్తిత్వం చేశారు. ఈ పొత్తులో జనసేన తక్కువ సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయినా… వైసీపీని అధికారం నుంచి దించడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. గత ఎన్నికల ఘోరపరాభవంతో జనసేనను అతికష్టం మీద నడుపుకొస్తున్న పవన్ కు ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారింది. పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే… జనసేన మరింత బలం పుంజుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో బలమైన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ… జనసేన ఎదుగుదలను కచ్చితంగా అడ్డుకుంటాయనేది వాస్తవం అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాటను రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పవన్ కు గెలుపు ఎంతో ముఖ్యమో… పవన్ ఓడిస్తే జనసేన పునాదిపై దెబ్బకొట్టవచ్చని వైసీపీ భావిస్తుందని అంటున్నారు. అందుకే ఆపరేషన్ పిఠాపురానికి వైసీపీ చాలా ప్రాధాన్యత ఇస్తుందంటున్నారు. ఈ ఎన్నికల్లో హాట్ సీటుగా పిఠాపురం నిలుస్తుందని అంటున్నారు.