IPL 2024: కోట్ల‌మంది క్రికెట్ అభిమానుల క‌ళ్లు ఎదురుచూస్తోన్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఆరంభానికి ఇంకా కొన్ని గంట‌లే మిగిలిఉంది. సంవ‌త్స‌రానికి ఒకసారి వ‌చ్చే ఈ క్రికెట్ పండుగ‌లో త‌మ అభిమాన క్రికెట‌ర్ల రికార్డుల కోసం ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్‌. ఇన్నాళ్లుగా త‌మ దేశం త‌ర‌ఫున ఆడిన క్రికెట‌ర్ ఈ సారి ఔట‌వ్వాలి అని కోరుకొంటుంటారు. అదేంటి అంటే అదే ఐపీయ‌ల్ మ‌హిమ‌. ఇక్క‌డ దేశాలుండ‌వు. ఫ్రాంఛైజీలు మాత్ర‌మే ఉంటాయి. ఇక మ‌రికొన్ని గంట‌ల్లోనే డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్‌కింగ్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తొలిపోరులో త‌ల‌ప‌డ‌నుంది. మ‌రి ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌కు వేదికైన ఐపీయ‌ల్ లో ఒక అరుదైన, అద్భుత‌మైన రికార్డులు నంబ‌ర్‌వ‌న్ స్థానంలో న‌దిలంగా ఉన్నాయి. వాటిని ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ చెర‌ప‌లేక‌పోయారు. టోర్నీ చ‌రిత్ర‌లో అలా మొద‌టిస్థానంలో నిలిచిపోయిన రికార్డుల‌ను ఓసారి చూసేయండి…

నంబ‌ర్‌వ‌న్ ఆట‌గాడు
మ‌హేంద్ర‌సింగ్ ధోనీ(MS Dhoni)… ఐపీయ‌ల్ చ‌రిత్ర‌(IPL )లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడి స్థానంలో నంబ‌ర్ వ‌న్ గా కొన‌సాగుతున్నాడు. 2008 లీగ్ ప్రారంభ‌మైనప్ప‌టి నుంచి ఆడుతున్న ధోనీ 250 మ్యాచ్‌లు ఆడి ఈ రికార్డ్ సొంతం చేసుకొన్నాడు. అస‌లు త‌న నాయ‌క‌త్వంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ను అత్యంత విజ‌య‌వంత‌మైన టీంగా నిలిపాడు. దాదాపు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ ఆడే ధోనీ త‌న టీంకి కొండంత‌బ‌లం. ఇప్ప‌టివ‌ర‌కు చెన్నైటీం లేకుండా ఐపీయ‌ల్లో వ‌రుస‌గా రెండు ఫైన‌ల్స్ జ‌ర‌గ‌లేదు అంటే ధోనీ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు

అమ‌రేంద్ర విరాట్ కోహ్లి(Virat Kohli)
ఐపీయ‌ల్లో విరాట్ కోహ్లి 7 సెంచ‌రీలు చేశాడు. 2008లో ఐపీయ‌ల్ అరంగేట్రం చేసిన కోహ్లీ 2023 సీజ‌న్ వ‌ర‌కు ఆడి ఈ ఘ‌న‌త సాధించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టోర్నీలో ఎవ‌రూ ఈ మార్క్‌ని అందుకోలేదు. అర్ధ‌సెంచ‌రీల ప‌రంగా చూసినా 50 ఫిప్టీస్ కొట్టేశాడు కోహ్లీ. దీంతో ఈ రికార్డ్ త‌న‌ పేరు మీదే లిఖించుకున్నాడు ఈ భార‌త స్టార్ ప్లేయ‌ర్‌. క్రికెట్ లో ప‌రుగుల ప‌రంగా ప్ర‌త్య‌ర్ధుల మీద ఎంత డామినేష‌న్ చూపిస్తాడు అనేందుకు ఇప్ప‌టికే అంత‌ర్జాతీయంగా ట‌న్నుల ప‌రుగుల‌తో నిరూపించినా వాటితో పాటు ఈ స‌రికొత్త ఐపీయ‌ల్ రికార్డ్ అద‌నం అని చెప్పుకోవాలి.

సుడి"గేల్" ఇన్నింగ్స్‌
ఐపీయ‌ల్ లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ విభాగంలో విధ్వంస‌క బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ (Chris Gayle)నంబ‌ర్ వ‌న్ గా ఉన్నాడు. గేల్ కేవ‌లం 66 బంతుల్లో 175 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చిన్న‌స్వామి స్టేడియంలో 23 ఏప్రిల్ 2013లోజ‌రిగిన పుణె తో జ‌రిగిన మ్యాచ్ లో క్రిస్‌గేల్ విధ్వంసం సృష్టించాడు. గేల్ ఊచ‌కోత కి పుణె బౌల‌ర్లు బ‌లైపోయారు. ఏ బాల్ వేసినా బౌండ‌రీ దాటేస్తోంది అంటే ప‌రిస్థితి అర్ధం అవుతుంది. క్రిస్‌గేల్ ఇన్నింగ్స్ లో 17 సిక్స్‌లు 13 ఫోర్లు ఉన్నాయి. స్ర్టైక్‌రేట్ 265 ఉంది. అంటే ఆ రోజు చిన్న‌స్వామి స్టేడియంలో గేల్ సునామీ చూసారు అభిమానులు.

త‌లా ధోనీ
ఐపీయ‌ల్‌లో ఎక్కువ మ్యాచ్ ల‌కు కెప్టెన్సీ చేసిన ఆట‌గాడిలో మ‌హేంద్ర‌సింగ్ ధోనీ మొద‌టి ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రైజింగ్ పుణె సూప‌ర్ జెయింట్స్ త‌ర‌ఫున నాయ‌క‌త్వం వ‌హించిన ధోనీ ఈ రికార్డ్ సాధించిన మొద‌టి కెప్టెన్ అయ్యాడు. ఐపీయ‌ల్ లో మొత్తం 226 మ్యాచ్‌ల‌కు కెప్టెన్సీ చేసిన మిస్ట‌ర్‌కూల్… జ‌ట్టుకు 133 విజ‌యాలు అందించాడు. త‌న నాయ‌క‌త్వంలో చెన్నైసూప‌ర్‌కింగ్స్‌ను 5 సార్లు విజేత‌గా నిలిపాడు. ఇక 2024 సీజ‌న్‌లోనూ కెప్టెన్సీ చేస్తోన్న ధోనీ ఏ కెప్టెన్ ద‌రిదాపుల్లో లేని త‌న రికార్డ్‌ను మ‌రింత మెరుగుప‌రుచుకోనున్నాడు.

డ‌క్‌…కార్తీక్
ఐపీయ‌ల్ లో ఎక్కువ సార్లు డ‌కౌట్ అయ్యిన ఒక రికార్డ్ దినేశ్‌కార్తీక్(Dinesh Karthik) పేరిట ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 17 సార్లు డ‌కౌట‌య్యి ఈ టోర్నీ చ‌రిత్ర‌లో అవ‌స‌రంలేని ఒక రికార్డుని త‌న‌ఖాతాలో వేసుకొన్నాడు కార్తీక్‌. మొత్తం 221 ఇన్నింగ్స్‌లో 17 సార్లు ఇలా సున్నా ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. మెత్తం త‌న ఐపీయ‌ల్ కెరియ‌ర్లో 5 టీమ్ ల త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించిన కార్తీక్ ఐపీయ‌ల్ లోఎక్కువ సార్లు డ‌కౌట్ అయ్యి మెద‌టిస్థానంలో కొన‌సాగుతున్నాడు.

వికెట్ల‌ని మ‌డ‌తబెట్టిన చాహ‌ల్‌
ఐపీయ‌ల్ లోఎక్కువ వికెట్లు తీసి భారీ హిట్టింగ్ మాత్ర‌మే సొంతమ‌నుకొన్న టోర్నీలో ఓ స‌రికొత్త రికార్డ్ త‌న ఖాతాలో వేసుకొన్నాడు య‌జువేంద్ర చాహ‌ల్‌. ఐపీయ‌ల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక వికెట్ల వీరుడి స్థానంలో మెద‌టిస్థానంలో కొన‌సాగుతున్నాడు.187 వికెట్ల‌తో నంబ‌ర్‌వ‌న్ గా కొన‌సాగుతున్నాడు చాహ‌ల్‌. 144 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించిన లెగ్‌స్పిన్న‌ర్ 7.66 ఎకాన‌మీతో బౌలింగ్ చేస్తాడు.

ర‌స్సెల్ బీభ‌త్సం
ఆండ్రూ ర‌సెల్‌. అప్ప‌టివ‌ర‌కు అత్య‌ధికంగా ప‌వ‌ర్‌ప్లేలో మాత్ర‌మే వీర‌బాదుడు చూసిన ప్రేక్ష‌కుల‌కి త‌న అరివీర భ‌యంక‌ర బ్యాటింగ్‌ని ప‌రిచ‌యం చేశాడు ఈ ఆల్‌రౌండ‌ర్‌. 174.00 స్ర్టైక్‌రేట్ తో ఐపీయ‌ల్ లో ఎక్కువ స్ర్టైక్‌రేట్ క‌లిగిఉన్న ఆట‌గాళ్ల‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు ఈ క‌రేబియ‌న్ స్టార్ ప్లేయ‌ర్‌. ఇత‌ని ధాటికి ఎంత‌టి బౌల‌ర‌యినా లైన్‌ త‌ప్పాల్సిందే. ఇక ల‌క్ష్యం ఎంతున్నా… దాన్ని బౌండ‌రీల రూపంలోక‌రిగించేయ‌డం ర‌సెల్‌కిమాత్ర‌మే సాధ్యం. ఐపీయ‌ల్ లో ఏ టీమ్ అయినా కోరుకొనే ఆట‌గాడు ఎవ‌రు అంటే ర‌సెల్‌. అదే అత‌నికి ఇంత భారీ స్ట్రైక్‌రేట్ క‌ట్ట‌బెట్టింది.

ఒక్క వికెట్ ప్లీస్‌…
టీం గెల‌వ‌డానికి ఒక్క ప‌రుగు కూడా ఎంత కీల‌కమో ఐపీయ‌ల్లో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక్క వికెట్ తో గెలిచిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇలాగే గ‌త సీజ‌న్ ఐపీయ‌ల్లో క్రికెట్ అభిమానుల హార్ట్‌బీట్ పెంచేసిన మ్యాచ్ ఒక‌టుంది. 2023 ఏప్రిల్ 10 న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. మైదానంలో, టీవీల్లో వీక్షిస్తోన్నకోట్ల‌మంది ప్రేక్ష‌కుల‌ను ఈ మ్యాచ్ ఆసాంతం మునివేళ్ల‌పై నిల‌బెట్టింది .అయితే మెద‌ట బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 212 ప‌రుగులు చేసింది. త‌ర్వాత బ్యాటింగ్ చేసిన ల‌క్నోమార్క‌స్ స్టొయినిస్‌, నికోల‌స్ పూర‌న్ ధాటికి 20 ఓవ‌ర్లలో 9 వికెట్లు కోల్పోయి 213 ప‌రుగుల చేసి సంచ‌ల‌న విజ‌యం త‌న‌ఖాతాలో వేసుకొంది. దీంతో ఒక్క వికెట్ తేడాతోగెలుపొందిన‌ట్ల‌యింది.

సాహోరే…ఆర్సీబీ
ఐపీయ‌ల్ లో అత్య‌ధిక టీం స్కోర్ విభాగంలో మొద‌టి స్థానంలో ఉంది… రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. 2013 ఏప్రిల్ 23 పుణె వారియ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఈ స్కోరు సాధించింది. మెద‌ట బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓపెన‌ర్ క్రిస్ గేల్ 175 ప‌రుగుల సునామీ ఇన్నింగ్స్‌తో ఇంత భారీ స్కోరు సాధించింది. పుణె వారియ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 20 ఓవ‌ర్ల‌కు గానూ బెంగ‌ళూరు ఐదు వికెట్లు కోల్పోయి 263 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. 13.15 ర‌న్ రేట్‌తో ఆడిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ … ఐపీయ‌ల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోరు చేసిన టీం విభాగంలో మొద‌టి స్థానంలో ఉంది. అప్ప‌టినుంచి ఈ రికార్డ్ ను మ‌రే టీం అందుకోలేదంటే ఈ ఇన్నింగ్స్ తీరు అర్ధం చేసుకోవ‌చ్చు.

మ‌హేంద్ర‌జాలం
ఐపీయ‌ల్ లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన వికెట్‌కీప‌ర్ జాబితా లో మెద‌టి స్థానంలో ఉన్నాడు మ‌హేంద్ర‌సింగ్ ధోని. 2008 నుంచి ఐపీయ‌ల్ ఆడుతున్న 180 బ్యాట‌ర్ల‌ను అవుట్ చేశాడు. ఇందులో 138 క్యాచ్‌లు, 42 స్టంపింగ్స్ చేసి నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక‌, వికెట్ల వెనుక ధోనీ ఎంత ప్ర‌మాద‌కారో ప్ర‌త్య‌ర్ధి ఐపీయ‌ల్ టీం లు అంద‌రికీ ఇప్ప‌టికే రుచి చూపించాడు. బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం ముందుకు వ‌చ్చి షాట్ ఆడే ప్ర‌య‌త్నం చేసే క్ర‌మంలో బాల్ మిస్ అయ్యాడో ఇక అంతే సంగ‌తులు. క్ష‌ణాల్లో ధోనీ గ్ల‌వ్స్ వికెట్ల‌ను గిరాటేస్తాడు. 42 ఏళ్ల వ‌య‌సులో కూడా ధోనీ ఇంత యాక్టివ్‌గా ఉండ‌టం… ఇక ద‌గ్గ‌ర‌లో ఏ వికెట్ కీప‌ర్ కూడా లేక‌పోవ‌డం ఈ రికార్డ్ కొన్నేళ్ల‌పాటు ధోనీ పేరుమీదే ఉండ‌టం ప‌క్కా.

Source link
previous post