LIC Children Plan AmritBaal Policy Details: ఇప్పుడున్న పరిస్థితుల్లో, సమాజంలోని ప్రతి వ్యక్తికి, చివరకు చిన్నారులకు కూడా బీమా రక్షణ ఉండాలి. పిల్లల కోసం చాలా రకాల బీమా పాలసీలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే, మారుతున్న కాలంలో బీమా రక్షణ మాత్రమే సరిపోదు. దానికి అదనంగా మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉండాలి. అలాంటి ఒక బీమా పాలసీని ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (LIC) అమలు చేస్తోంది.
LIC తీసుకొచ్చిన కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ పేరు ‘అమృత్‌బాల్’. గత నెల 17న (ఫిబ్రవరి 17, 2024) ఇది మార్కెట్‌లోకి వచ్చింది, ప్రజలకు చేరువైంది. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బీమా పథకం ఇది. దీనిని LIC ప్లాన్ నంబర్ 874 గాను పిలుస్తారు.
అమృత్‌బాల్ పథకం గురించి ఎందుకు తెలుసుకోవాలి? పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించే తల్లిదండ్రులు అమృత్‌బాల్ పథకాన్ని పరిశీలించవచ్చు. బిడ్డల ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం వారి చిన్నతనం నుంచే పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే, LIC అమృత్‌బాల్ పథకం గురించి తెలుసుకోవాలి. ఇందులో, చిన్నారులకు జీవిత బీమాతో పాటు, కచ్చితమైన రాబడికి హామీ (Guaranteed Return) కూడా లభిస్తుంది.
ఎంత వయస్సు లోపు పిల్లల కోసం?ఈ పాలసీని 30 రోజుల నుంచి 13 ఏళ్ల లోపు చిన్నారుల కోసం తీసుకోవచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ గడువు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ పాలసీ కోసం 3 రకాల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి..(1) 5 సంవత్సరాలు (2) 6 సంవత్సరాలు (3) 7 సంవత్సరాలు. గరిష్ట ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాలు. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి కట్టొచ్చు. ఇందుకోసం సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ (Single premium payment option) కూడా అందుబాటులో ఉంది.
అమృత్‌బాల్ పాలసీ కింద కనిష్టంగా రూ. 2 లక్షల బీమా కవరేజ్ తీసుకోవాలి. 5వ సంవత్సరం లేదా 10వ సంవత్సరం లేదా 15వ సంవత్సరంలో మెచ్యూరిటీ సెటిల్‌మెంట్ ఉంటుంది. మనీ బ్యాక్ ప్లాన్‌లాగా దీనిని మార్చుకోవచ్చు.
అమృత్‌బాల్ ఇన్సూరెన్స్ పాలసీలో, పాలసీహోల్డర్ కట్టే ప్రీమియంలో ప్రతి వెయ్యి రూపాయలకు 80 రూపాయల చొప్పున గ్యారెంటీడ్ రిటర్న్ పొందొచ్చు. ఈ 80 రూపాయలు బీమా పాలసీ మొత్తానికి యాడ్ అవుతుంది. మీ చిన్నారి పేరు మీద రూ.1 లక్ష బీమా తీసుకుంటే, ఆ మొత్తానికి ఎల్‌ఐసీ రూ.8000 జోడిస్తుంది. ఈ డబ్బు ప్రతి సంవత్సరం చివరిలో యాడ్ అవుతుంది. పాలసీ చెల్లుబాటులో ఉన్నంత వరకు ఈ రిటర్న్ మీ పాలసీకి కలుస్తూనే ఉంటుంది.
ఇతర ప్రయోజనాలుఅమృత్‌బాల్ పాలసీలో పెట్టుబడి పెడితే.. పాలసీ మెచ్యూరిటీ సమయంలో సమ్ అష్యూర్డ్ + గ్యారెంటీడ్ రిటర్న్ కలిపి తిరిగి వస్తాయి. పాలసీ కొనుగోలుదారుకు ‘సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్’ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, కొంచెం అదనపు ప్రీమియం చెల్లిస్తే ప్రీమియం రిటర్న్ రైడర్‌ను కూడా పొందొచ్చు. ఈ రైడర్ వల్ల, ప్రీమియం రూపంలో కట్టిన డబ్బు (పన్నులు మినహా) తిరిగి వస్తుంది.
అమృత్‌బాల్ పాలసీని మీ దగ్గరలోని ఎల్‌ఐసీ కార్యాలయం/ ఎల్‌ఐసీ ఏజెంట్ల దగ్గర తీసుకోవచ్చు, లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి