రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంతో మంది ప్రముఖులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎంతో మంది ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ పార్టీలకు అతీతంగా కొత్త ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు.
ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డిని ఎంతో మంది సినీ ప్రముఖులు కలిశారు. తాజాగా దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి కూడా ఆ లిస్ట్‌లో చేరారు. టాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. వీరిద్దరినీ దర్శకనిర్మాతలు అనేకంటే మంచి స్నేహితులు అనడం కరెక్ట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళతారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు కూడా కలిసే వెళ్ళారు. రేవంత్‌కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.