Janasena Candidates : జనసేన పార్టీ మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను(Janasena Candidates) ఖరారు చేసింది. టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేనకు 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు కేటాయించారు. ఈ సీట్లలో విడతల వారీగా జనసేన అభ్యర్థులను ఖరారు చేస్తుంది. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం(P Gannavaram), ఏలూరు జిల్లాలోని పోలవరం(Polavarama) అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించారు. ఈ రెండు స్థానాలు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. పి.గన్నవరం నియోజకవర్గం గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అందించారు. పి.గన్నవరం నేతలతో భేటీ అయిన పవన్ కల్యాణ్… స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ల దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారన్నారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారన్నారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కోరారు. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసేనదే, గెలుపు మనదే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.