ఆ బస్సును సీబీఐకి ఎందుకు అప్పగించలేదు?
కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా కంపెనీకి(Sandhya Aqua Company) చెందిన బస్సును పోలీసులు సీబీఐ(CBI) అధికారులు ఎందుకు అప్పగించలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(TDP Pattabhiram) ప్రశ్నించారు. బస్సులో తనిఖీలు చేసి తిరిగి దానికి కంపెనీ ప్రతినిధులకే ఎందుకు అప్పగించారని నిలదీశారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు సోదాలకు వస్తున్నారని సంధ్య ఆక్వా ప్రతినిధులకు ముందే సమాచారం అందిందన్నారు. అందుకే కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, రికార్డులను బస్సులో వేరొక చోటికి తరలించారని ఆరోపించారు. మూడు రోజులుగా మూలపేటలో ఉన్న బస్సును(Sandhya Aqua Bus) పోలీసులు తనిఖీలు చేసి సీబీఐకి అప్పగించకుండా…తిరిగి సంధ్య కంపెనీ వాళ్లకే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సీబీఐకి ఆధారాలు దొరక్కుండా చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తునకు అడ్డుతగలాలని పోలీసులకు(AP Police) ఆదేశాలు వచ్చాయా? బస్సులో దొరికిన డాక్యుమెంట్లలో ఏముంది? అని పట్టాభి ప్రశ్నించారు. ఇంత పెద్ద వ్యవహారంలో పోలీసులు సీబీఐకి ఎందుకు సహకరించడంలేదని, దీని వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు.