‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) మరోసారి చేతులు కలబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.
ప్రస్తుతం తన 15వ సినిమా ‘గేమ్ ఛేంజర్’ను శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న రామ్ చరణ్.. 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక 17వ సినిమా కోసం సుకుమార్ తో రెండోసారి చేతులు కలుపుతున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించనున్నాయి. ‘రంగస్థలం’ సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మించడం విశేషం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హోలీ పండగ సందర్భంగా ఈరోజు అనౌన్స్ చేశారు. ఇండియన్ సినిమాకి కొత్త రంగులు అద్దడానికి #RC17 సిద్ధమవుతోంది అంటూ ప్రకటనలో మేకర్స్ పేర్కొన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప-2’ని రూపొందించే పనిలో ఉన్న సుకుమార్.. దాని తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలుపెట్టి.. 2025 చివరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.