రామ్ చరణ్.. ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్. గ్లోబల్ స్టార్‌కి నిర్వచనంగా నిలుస్తూ.. కూల్‌గా, కామ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తండ్రికి తగ్గ కాదు.. తండ్రిని మించిన తనయుడిగా కీర్తి గడిస్తున్నాడు. తొలి సినిమాతో టాలీవుడ్‌పై పంజా విసిరిన ఈ చిరుతనయుడు.. రెండో సినిమాతోనే మెగాధీరుడి పవర్ ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో చూపించి మెగా పవర్ స్టార్‌గా స్టాంప్ వేయించుకున్నాడు. తొలి రెండు సినిమాలకు మెగా ట్యాగ్ అంటూ కొందరు విమర్శలు చేసినా.. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. డీలా పడలేదు. ధృవతో దుమ్మురేపి.. సిట్టిబాబుగా విమర్శకుల నోళ్లు మూయించాడు. రంగస్థలం వంటి వెండితెరపై రామ్ చరణ్ చేసిన రచ్చకి ప్రేక్షకలోకం నీరాజనాలు పలికింది. తన రేంజ్ ఏంటో తనకి తెలియజెప్పిన చిత్రంగా రంగస్థలం రామ్ చరణ్ కెరీర్‌ని టర్న్ చేసింది. ఇక సీతారామరాజుగా చరణ్ వేషధారణ, ఆహార్యం.. ఇలా ఒక్కటేమిటి.. ఒక నటుడిగా చరణ్ ప్రస్థానాన్ని ఆర్ఆర్ఆర్ ప్రపంచానికి తెలియజేసింది. ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని సైతం అబ్బురపరిచే నటనతో.. ఆ సినిమాతో గ్లోబల్ కీర్తిని సొంతం చేసుకుని.. ఒక్కసారిగా గేమ్ చేంజర్‌గా మారిపోయాడు. అయితే ఈ కీర్తి వెనుక ఆయన పడిన కష్టం, కృషిని అభినందించకుండా ఉండలేం.
వారసత్వాన్ని జయించి..
ఒక్క తెలుగులోనే కాదు ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో నట వారసులు వచ్చారు. అందులో కొందరు గొప్పగా ఎదిగారు. ఇంకొందరు తమకు తగ్గ పాత్రలు ఒప్పుకున్నారు. మరికొందరు మౌనంగా తప్పుకున్నారు. అయితే సాలిడ్‌గా సక్సెస్ అయిన స్టార్ కిడ్స్ కూడా తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారే తప్ప తండ్రిని మించిన ఖ్యాతిని గడించే దిశగా దూసుకుపోతోంది ఒక్క రామ్ చరణే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. సచిన్ కొడుకు సచిన్ కాలేదు.. అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేదు… కానీ చిరంజీవి కొడుకు చిరంజీవిని దాటేస్తున్నాడనే వ్యాఖ్యలతో అభిమానులు హంగామా చేస్తున్నారంటే నేడు చరణ్‌కి విశ్వవ్యాప్తంగా ఏర్పడ్డ విపరీతమైన క్రేజే అందుకు కారణం. అయితే రామ్ చరణ్ పొందిన ఈ క్రేజ్ వెనుక.. స్టార్‌గా సాధించిన రేంజ్ వెనుక తను ఎన్ని సవాళ్ళను స్వీకరించాడో, ఎన్ని ఛాలెంజెస్‌ని స్వాగతించాడో పరిశ్రమ అంతటికీ తెలుసు. అసలు మిగిలినవన్నీ ఎందుకు, ఇటు మెగాస్టార్ గ్రేస్ నీ – అటు పవర్ స్టార్ స్టైల్ నీ బ్యాలెన్స్ చేస్తూ.. అభిమానుల అంచనాలను మ్యాచ్ చేసే స్క్రీన్ ప్రెజన్స్ చూపించడం అనేదే అతి పెద్ద టాస్క్. ఆ విషయంలో తనదైన స్పార్క్‌ని ప్రొజెక్ట్ చేసి మంచి మార్కులు వేయించేసుకున్న చరణ్ ప్రస్తుతం ఇక వెండితెరపై తనదైన ప్రత్యేక ముద్రను వేసే విధంగా తదుపరి చిత్రాల కథలను, తన పాత్రలను ఏరి కోరి ఎంచుకుంటున్నాడు.
ఆర్డర్ చూస్తుంటే మెంటలెక్కిపోతోంది..
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చే సినిమా ఆలస్యం అయి ఉండొచ్చు కానీ.. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసే సినిమాల ఆర్డర్ చూస్తే మాత్రం నిజంగా మెంటలెక్కిపోవడం ఖాయం. ఎందుకంటే చరణ్ ఆర్డర్ అలా ఉంది మరి. ప్రస్తుతం చేస్తున్న సినిమా RC15 గేమ్ చేంజర్. దర్శకదిగ్గజం శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా తర్వాత RC16 ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఉండనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక బర్త్‌డే స్పెషల్‌గా RC17 ప్రకటన కూడా వచ్చేసింది. రంగస్థలంతో రామ్ చరణ్ రేంజ్‌నే మార్చేసిన క్రియేటివ్ డైరెక్టర్, టాలీవుడ్ హీరోకి నేషనల్ అవార్డ్ రావడానికి కారణమైన సుకుమార్ దర్శకత్వంలో RC17 అనగానే.. అంచనాలు ఆకాశానికి వెళ్లిపోయాయి. RC18 బాలీవుడ్ దిగ్ధర్శకుడి దర్శకత్వంలో ఉండే అవకాశం ఉంది.
ఈ గ్లోబల్ స్టార్‌కే సాధ్యం..
అంతటి ఒత్తిడి తలపై ఉన్నా, అంత భారం మోస్తున్నా.. వాటిని ఒత్తిడి, భారం అనుకోకుండా బాధ్యతగా తీసుకోవడం అనేది ఈ గ్లోబల్ స్టార్‌కే సాధ్యం. దీని కోసం ఆయన లోపల ఎంత ఒత్తిడితో ఫైట్ చేస్తున్నా.. బయట మాత్రం ఎప్పుడూ మనసులో, మోములో ప్రశాంతతతో కనిపించడమే రామ్ చరణ్‌లోని గొప్ప లక్షణం. ఈ క్రమంలో ఆయనకు స్ట్రైస్ బస్టర్స్‌గా ఆయన సతీమణి ఉపాసన, కుమార్తె క్లీంకార నిలుస్తున్నారనే విషయం.. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ మూమెంట్స్ చూస్తున్న ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. రీసెంట్‌గా ఉపాసన, క్లీంకారతో సముద్రతీరాన చరణ్‌ని చూసిన వారంతా.. ఎంత హ్యాపీగా ఫీలయ్యారో చెప్పడానికి సోషల్ మీడియా ఒక్కటి చాలు.
క్రేజ్ కా బాప్..
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి రావాల్సిన గేమ్ చేంజర్ ఇంకా సెట్స్‌పైనే ఉంది. ఆర్ఆర్ఆర్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ప్రస్తుతం చేస్తున్న గేమ్ చేంజర్ పోస్టర్ తప్ప.. ఎటువంటి అప్‌డేట్ లేదు. అయినా కూడా చరణ్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.. పైగా డబుల్ అయిందని చెప్పుకోవాలి. ఆర్ఆర్ఆర్‌తో వచ్చిన గ్లోబల్ గుర్తింపును కంటిన్యూ చేయడం.. అందునా ఎటువంటి అప్‌డేట్ లేకుండా అంటే సామాన్యమైన విషయం కానే కాదు. అందుకు కారణం చరణ్ నడవడికే. బాలీవుడ్ స్టార్స్ బర్త్‌డే పార్టీస్‌లో, అయోధ్య టెంపుల్ ఓపెనింగ్‌లో, అంబానీ ఇంటి పెళ్లి సంబరాల్లో.. ఇలా ఒక్కటేమిటి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కడ చూసినా రామ్ చరణ్ నామస్మరణే. అందుకే అంది.. క్రేజ్ కా బాప్ అని. ఫైనల్‌గా.. మంచితనానికి మారుపేరుగా.. కష్టాలలో ఉన్నవారిని చూస్తే కరిగిపోయే మనసున్న మహావ్యక్తిగా.., గొప్ప ఫ్యామిలీ మ్యాన్‌గా.., శ్రమించడంలోనే సక్సెస్ ఉందని నమ్మే చిరుతనయుడిగా మరిన్ని కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని కోరుకుంటూ.. గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది సినీజోష్. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ (#HappyBirthdayGlobalStarRamCharan).