Sunrisers Hyderabad vs Mumbai Indians Match head to head records : హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ముంబై(MI) జట్ల మధ్య పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని భావిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా ఈ రెండు జట్లు ఇప్పటివరకూ నాలుగుసార్లు తలపడగా చెరో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ హైదరాబాద్, ముంబై జట్లు 20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. హైదరాబాద్ అయిదు మ్యాచుల్లో గెలిచింది. 2020 ఐపీఎల్ సీజన్ నుంచి ముంబైపై హైదరాబాద్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ వేదికపై జరిగిన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైని ఓడించడం సన్‌రైజర్స్ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది.
పిచ్ ఎలా ఉంటుందంటే..?
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గత 10 టీ20 మ్యాచ్‌ల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 175 పరుగులు. ఒక ఇన్నింగ్స్‌లో కోల్పోయిన వికెట్ల సగటు సంఖ్య ఆరు. హైదరాబాద్ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. గత 10 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్లు ఆరుసార్లు విజయం సాధించాయి. ఈ గేమ్‌లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
బ్యాటర్లు రాణిస్తే…
అయిదుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, డెవాల్డ్ బ్రెవిస్ రాణించినా ముంబైకి ఓటమి తప్పలేదు. రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేసినా మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. విధ్వంసకర బ్యాటర్లు ఉన్న ముంబై 36 బంతుల్లో 48 పరుగులు చేయలేక ఓటమిపాలు కావడం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. ముంబై కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్‌లో హార్దిక్ ఆకట్టుకోలేక పోయాడు. టిమ్ డేవిడ్, బ్రెవిస్ వంటి ఆటగాళ్లను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు తీసుకొచ్చిన హార్దిక్… తాను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇది ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్, సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగినా విఫలమయ్యాడు. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి వెనుదిరిగాడు. ఇషాన్‌కు టీ 20 ప్రపంచకప్ ఆడాలంటే ఐపీఎల్‌లో రాణించడం అవసరం. హైదరాబాద్ మ్యాచ్‌లో బ్యాటర్లంతా గాడినపడాలని ముంబై కోరుకుంటోంది. స్పిన్నర్లు షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా నుంచి హార్దిక్ మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నాడు.
కమ్మిన్స్ సమర్థంగా నడిపిస్తాడా..?
సొంతగడ్డపై ఆడనుండడం హైదరాబాద్‌కు కలిసిరానుంది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు… కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పరాజయంపాలైన మంచి ఆటతీరు ప్రదర్శించింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే హైదరాబాద్ గాడిన పడినట్లే. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ SRHకు కీలకంగా మారనుంది. అబ్దుల్ సమద్‌పై హైదరాబాద్ భారీ ఆశలు పెట్టుకుంది. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ రాణిస్తే ముంబై బ్యాటర్లకు తిప్పలు తప్పవు.
మరిన్ని చూడండి