Gujarat Titans Captain Shubman Gill fined RS 12 Lakh : ఐపీఎల్ 17వ సీజన్‌లో మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్(CSK) వర్సెస్ గుజరాత్ టైటాన్స్(GT) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. అసలే ఓటమి బాధ్యలో ఉన్న గుజరాత్ కు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్(Shubman Gill)పై రూ.12 లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్ ప్రకటన చేసింది. ఇలాంటి పొరపాటు ఇదే సీజన్‌లో మరోసారి చేస్తే ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దీంతో ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
“మినిమమ్ ఓవర్ రేట్‌కు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో ఇది గుజరాత్ టైటాన్స్ జట్టు చేసిన మొదటి నేరం కావడంతో గిల్‌కి రూ. 12 లక్షల జరిమానా విధించడం జరిగింది” అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది. రెండోసారి ఇలానే జరిగితే రూ. 24 లక్షల జరిమానా, జట్టు సభ్యుల వేతనంలో కోత పడుతుంది. తరువాత జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచులో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ తొలి ఓటమిని ఎదుర్కొంది.
రికార్డు స్థాయిలో 63 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సీఎస్‌కే విధించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులకే పరిమితమైంది. ముందుగా బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో తేలిపోయిన గిల్ సేన చెన్నైపై ఘోర పరాజయాన్ని చవిచూసింది.ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ఐదు బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. శుభ్‌మాన్ గిల్ ఇటీవలే గుజరాత్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్లడంతో.. గిల్ గుజరాత్ జట్టు బాధ్యతలు తీసుకున్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే ..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె అర్థ సెంచరీతో చెలరేగగా రచీన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ చెరో 46 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయి కిశోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేధనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి ఓటమి పాలైంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సాయి సుదర్శన్ 37, సాహా 21, మిల్లర్ 21 పరుగులు చేశారు. మిగతావారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపర్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మన్ తలో రెండు వికెట్లు తీయగా, డారిల్ మిచెల్, పతిరన ఒక్కో వికెట్ పడగొట్టారు. గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి మ్యాచ్ లో ముంబై జట్టుపై విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓడిపోయింది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
మరిన్ని చూడండి