Why Kl Rahul Not Captaining Lucknow Super Giants : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కె.ఎల్. రాహుల్‌కు బదులుగా లక్నో కెప్టెన్‌గా నికోలస్ పూరన్ టాస్‌కు వచ్చాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న రాహుల్.. పనిభారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. కెప్టెన్‌గా లేకున్నా.. కేఎల్ రాహుల్ తుది జట్టులో ఉంటాడని.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడని పూరన్ చెప్పాడు.
ఈ సీజన్‌లో పంజాబ్‌తో మ్యాచ్ కాకుండా లక్నో జట్టు ఆడిన ఒకే ఒక మ్యాచు లోను రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఒక్క మ్యాచుకే రాహుల్‌కు అంత విశ్రాంతి అవసరమైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాయం కారణంగా గత సీజన్ రెండో అర్ధభాగానికి రాహుల్ పూర్తిగా దూరమయ్యాడు. ఆ తర్వాత ఆసియా కప్‌తో రీఎంట్రీ ఇచ్చి.. వన్డే ప్రపంచకప్ 2023 సైతం ఆడాడు. తరువాత మరోసారి గాయంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో చివరి నాలుగు మ్యాచులకు దూరమైన రాహుల్ ఇంకా కోలుకోలేదని.. అందుకే అతడిని తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో KL రాహుల్ బ్యాటింగ్ తో పాటూ వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించాడు. ఏకంగా రాహుల్ 20 ఓవర్లపాటు కీపింగ్ చేసి బ్యాటింగ్ కూడా చేశాడు. అయితే టీ 20 ప్రపంచ కప్‌లో భారత జట్టు కీపర్‌గా ఎంపికవ్వాలని రాహుల్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్ నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. లక్నో జట్టులో క్వింటన్ డి కాక్… పూరన్ ఇద్దరు మంచి కీపర్‌లు ఉన్నారు. అయినా రాహుల్ కీపింగ్ చేస్తుండడం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎల్-17లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఓపెనర్ క్వింటాన్ డికాక్ 54, నికోలస్ పూరన్ 42, కృనాల్ పాండ్య 43 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2, కగిసో రబాడ, రాహుల్ చాహర్… ఒక్కో వికెట్ పడగొట్టారు. అనతంరం భారీ లక్ష్య ఛేధనలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ 70, బెయిర్ స్టో 42 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో పంజాబ్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ కి రాహుల్ విశ్రాంతి తీసుకున్నాడు.
సీజన్ మొత్తాన్ని పూరన్ పూరిస్తాడా ..
రాహుల్ స్థానంలో లక్నో జట్టు పగ్గాలను నికోలస్ పూరన్ అందుకున్నాడు. అయితే ఇది లక్నో ఫ్రాంచైజీ తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయమా లేదా ఈ సీజన్ మొత్తానికి తీసుకున్న నిర్ణయమా అనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పనిభారాన్ని తగ్గించుకోవాలని రాహుల్ చూస్తున్నాడా? లేదా పూర్తి ఫిట్‌నెస్ సాధించముందే ఐపీఎల్ ఆడుతున్నాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని చూడండి