IPL 2024 RR vs RCB Rajasthan Royals opt to bowl : ఐపీఎల్(IPL) 17 సీజన్‌లో భాగంగా జైపుర్ వేదికగా రాజస్థాన్(RR)తో బెంగళూరు(RCB) తలపడనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ప్రత్యర్థి జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. హ్యాట్రిక్ విజయాలతో ఉత్సాహంగా ఉన్న రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు(RCB)….అగ్ని పరీక్ష ఎదుర్కోనుంది. వరుసగా పరాజయాలతో సతమతం అవుతున్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని చూస్తోంది. బెంగళూరు ఈ ఐపీఎల్‌లో ఐదో మ్యాచ్ ఆడనుంది. రాజస్థాన్‌కు ఇది నాలుగో మ్యాచ్.
బెంగళూరు జట్టులో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్‌లతో కూడిన RCB టాపార్డర్… పేపర్‌పై చాలా బలంగా ఉంది. కానీ మైదానంలో వీరు వరుసగా విఫలమవుతండడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే బెంగళూరు జట్టులో స్థిరంగా రాణిస్తున్నాడు. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాణించకపోవడం ఒక్కటే రాజస్థాన్‌ను ఆందోళన పరుస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లో జైస్వాల్ కేవలం 39 పరుగులే చేశాడు. జోస్ బట్లర్ కూడా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ఇంగ్లండ్ T20 కెప్టెన్ కూడా అయిన బట్లర్.. ఇంకా ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. బట్లర్ మూడు మ్యాచుల్లో కేవలం 35 పరుగులే చేశాడు. ఈ మూడు మ్యాచుల్లోనూ బట్లర్ స్ట్రైక్ రేట్ కేవలం 85 మాత్రమే ఉండడం రాజస్థాన్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనపరుస్తోంది. రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ సంజూ శాంసన్ (109 పరుగులు, ఒక అర్ధశతకం), రియాన్ పరాగ్ (181 పరుగులు, 2 అర్ధశతకాలు) మోస్తున్నారు.
ఇప్పటివరకూ ఇరు జట్లు 30 మ్యాచుల్లో తలపడగా బెంగళూరు 15 మ్యాచుల్లో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. ఆర్‌ఆర్‌పై బెంగళూరు అత్యధిక స్కోరు 200 కాగా, ఆర్‌సిబిపై రాజస్థాన్ అత్యధిక స్కోరు 217. ఈ మ్యాచ్ జరిగే జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడగా రాజస్థాన్ రాయల్స్ నాలుగు సార్లు గెలవగా… బెంగళూరు కూడా నాలుగు మ్యాచుల్లో గెలిచింది. 2023లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
రాజస్థాన్ రాయల్స్ (RR): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఫాఫ్ డు ప్లెసిస్ , విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ మయాంక్ దాగర్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
మరిన్ని చూడండి