ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, దానికోసం శాయశక్తులా కష్టపని చేస్తే, ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని తాజాగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) రుజువు చేశాడు. రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’ సినిమా సమయంలో ఓ ఇంటర్వ్యూలో సిద్ధు మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్ళలో తాను నటించిన సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పాడు. చెప్పినట్లుగానే తన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్'(Tillu Square)తో రెండేళ్లకే రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు.
‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా.. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.101.4 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించిన ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి పాటలు స్వరపరచగా, భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు.