దిశ, ఫీచర్స్ : చుట్టూ నీరు, నట్ట నడుమ అందమైన ఖాళీ ప్రదేశం, ఒకవైపు పచ్చటి చెట్లు, మరో వైపు తీరాన్ని తాకుతున్న అలలు, అప్పుడప్పుడూ వచ్చి ఒక్కసారిగా శరీరాన్ని హత్తుకుంటూ పలకరించే పిల్ల గాలులు.. మొత్తానికి అదొక ప్రకృతి రమణీయ దృశ్యం. ఎంత సేపు చూసినా తనివి తీరని భూతల స్వర్గం. అయితే ఎప్పుడూ జన సంచారంతో కళకళలాడే ఆ ప్రాంతం, ఇప్పుడు మాత్రం ఎవరూ అటువైపు రాక వెల వెల బోతోంది. ఇంతకీ ఆ ప్రాంతమేదో అనుకుంటున్నారా? ఆఫ్రికా దేశంలోనే అందమైన పర్యాటక ప్రదేశాల్లో టాప్‌లో ఉన్న జాంబిబార్ దీవులు.
వాస్తవానికి జాంబిబార్ దీవులు ఆఫ్రికాలోని టాంజానియా దీవుల సమూహంలో భాగం. అందమైన ఈ ప్రాంతానికి వివిధ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. రష్యా, భారత్ నంచి అయితే ఇంకా ఎక్కువమంది వెళ్తుంటారట. అలా విదేశీ పర్యాటకులవల్లే 90 శాతం ఆదాయం చేకూరుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల ఎవరూ రావడం లేదని, పర్యాటక రంగం దెబ్బ తింటోందని జాంబిబార్ దీవులను పర్యవేక్షిస్తున్న పాలకవర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనికి అసలు కారణం ఏంటంటే.. ఇక్కడ ప్రస్తుతం బీరు సంక్షోభం ఏర్పడిందట. అసలే అందమైన దీవులు, పైగా వాటిని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వచ్చే పర్యాటకులు అత్యధిక మంది ఇక్కడి చల్లని బీరును తాగుతూ ప్రకృతిని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం అది లభించడం లేదని, దీంతో పర్యాటకులు కూడా రావడం లేదని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హిందూ మహా సముద్రపు దీవుల్లో భాగమమైన జాంబిబార్ దీవులు. కేవలం చల్లని బీరు కొరత కారణంగా ఇప్పుడు కళ తప్పుతున్నాయి. అరుదుగా లభించినప్పటికీ ధరలు విపరీతంగా పెరగడం కారణంగా ఇక్కడి చల్లని బీరును ఆస్వాదించాలనుకునేవారికి నిరాశే ఎదురవుతోందని ఆ దీనివు పర్యాటక విభాగం అధికారులు పేర్కొంటున్నారు. ఇసుకు బీచ్‌లతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉండే జాంబిబార్ దీవులు ఈ కారణంగానే ఇప్పుడు వెల వెలబోతున్నాయి. ఇక అప్పుడప్పుడూ వస్తున్న పర్యాటకులు తప్పని పరిస్థితిలో జాంబిబార్ దీవులకు ఉత్తరాన ఉండే మాటెమ్వా బీచ్‌లలో కేవలం సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే ఆస్వాదించాల్సి వస్తోంది. ఒకవేళ ఎవరికైనా బీరు కావాల్సి వస్తే ఇక్కడికి దూరంగా ఉండే స్టోన్ టౌన్‌కు వెళ్లి తాగాల్సి వస్తోందని, పైగా ధర ఎక్కువగా ఉంటోందని పర్యాటకులు, స్థానికులు చెప్తున్నారు.